సత్తిబాబు దూరం అవుతున్నారా..

 సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. సామాజికపరంగా, ఆర్థికంగా ఆయన బలమైన నేత. ఉత్తరాంధ్రలో ఆయన మోస్ట్ సీనియర్ మాత్రమే కాదు.. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన బొత్స సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదా? అన్న ప్రశ్నకు నిన్నటి జగన్ విజయనగరం జిల్లా పర్యటన స్పష‌్టం చేస్తుంది. ఎందుకంటే తన సొంత జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వస్తే బొత్స సత్యనారాయణ మాత్రం హాజరు కాలేదు. ఎక్కడా ఆయన టూర్ లో కనిపించలేదు. గొర్ల గ్రామంలో పర్యటించిన జగన్ డయేరియా బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కనీసం సమాచారం బొత్స సత్యనారాయణకు లేదంటున్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. సత్తిబాబు లేకుండా తొలిసారి జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించినట్లయింది. ఆయన గైర్హాజరీ కారణాలపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. బొత్స ఎందుకు రాలేదు? ఆయనలో ఉన్న అసంతృప్తి ఏంటి? జగన్ కు ఆయనకు దూరం పెరిగిందా? మొన్ననే కదా? ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మరీ బొత్స సత్యనారాయణను శాసనమండలిలో చీఫ్ గా చేశారు. అలాంటి సత్తి బాబు ఎందుకు డుమ్మా కొట్టారన్న దానిపై పార్టీలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.కానీ కొన్ని కారణాల వల్లనే బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు విజయసాయి రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో సత్తిబాబు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. గతంలో విజయసాయిరెడ్డి వల్లనే పార్టీకి ఇక్కడ డ్యామేజీ జరిగిందని, మళ్లీ జగన్ అదే తప్పు చేశారని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. తనకు సంప్రదించుకుండానే ఉత్తరాంధ్రకు ఇన్‌ఛార్జిని నియమించడం, అదీ విజయసాయిరెడ్డిన నియమించడంతోనే జగన్ విజయనగరం జిల్లా పర్యటనకు దూరంగా ఉన్నారని కొందరు నేరుగా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి నియామకం నచ్చని బొత్స తన అసంతృప్తిని ఈ విధంగా తెలియజేశారంటున్నారు. జిల్లాలోనే క్లీన్ స్వీప్ చేసి… మొన్నటి ఎన్నికలలో బొత్స సత్యనారాయణతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గ స్థానాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. తొమ్మిదింటికి తొమ్మిదిస్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీకి జీరో సీట్లు వచ్చాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు తెలిసింది. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా ఆయన బాధపడుతున్నారని తెలిసింది. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేయకపోయినా తన అసంతృప్తిని మాత్రం అధినేత ఎదుట ఈ విధంగా వెళ్లగక్కారంటున్నారు. మరొకరు తాను వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని ముందుగానే పార్టీ హైకమాండ్ కు సమాచారం ఇచ్చారన్న వాదన కూడా వినిపిస్తుంది. మొత్తం మీద జగన్ టూర్ లో సత్తి బాబు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *