అంతర్జాతీయ విప్లవ కెరటం చేగువేరా

-నేడు ఆయన వర్ధంతి
సిరా న్యూస్;
క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చేగు వేరా. సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు. 1928లో అర్జెంటీనాలో రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చేగువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడు. చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడు. ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడు. అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడు. మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడు. 1955 జూలైలో చేగువేరా ఫీడల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. కాస్ట్రో వ్యక్తిత్వం ఆయనకు ఎంతో నచ్చింది. వారితో పాటు పోరాటంలో చేరాడు. క్యూబనే్ల అతనికి ‘చే’ అని పేరు పెట్టారు. అర్జెంటీనాలో ఆత్మీయులను ప్రేమగా పిలిచే పేరు అది. 1955 ఆగస్టు 19న చేగువేరా హిల్టా గజ్‌యా అనే ఆర్థికవేత్తను వివాహం చేసుకున్నాడు. చేగువేరా క్యూబా విప్లవకారులతో కలిసి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1958 డిసెంబర్ చివరకు తిరుగుబాటు సేనలు శాంతా క్లారా పోరాటంలో విజయం సాధించారు. ఇది గొప్ప మలుపు తిప్పింది. 1959 జనవరి ఒకటవ తేదీన క్యూబా దేశంలో నూతన సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. చేగువేరా క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల గల గొప్ప సిద్ధాంతకర్త. ఆస్తమా అనునిత్యం వేధిస్తున్నా విప్లవోద్యమంలో వెనకడుగు వేయలేదు. 1959 క్యూబా విప్లవ అనంతరం చేగువేరా క్యూబా ప్రభుత్వంలో అనేకమైన కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించాడు. 1965 తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. 1965లో ఆఫ్రికా వెళ్లి కాంగోలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కాంగోలో పాట్సిస్‌లు ముంబా నాయకత్వాన ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడితే అమెరికా దాన్నికూలదోసి ఆయనను హత్య చేయించింది. 1966 నవంబర్‌లో మారువేషంలో ఐరోపా మీదుగా బొలీవియా బయలుదేరి వెళ్లాడు. బొలీవియా వెళ్లే ముందు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా ప్రజల సంఘీభావ సంస్థను ఉద్దేశించి చేగువేరా ఒక సందేశాన్ని పంపించాడు. చిలీ అర్జెంటీనా, పరుగ్వే సరిహద్దులో గెరిల్లా స్థావరం ఏర్పరుచుకున్న చేగువేరా బొలీవియా సైనిక ప్రభుత్వంపై 11 మాసాలపాటు విప్లవ పోరాటం సాగించాడు. ఆయన టీంలోని యాభైమందిలో 17మంది క్యూబన్లు ఉండేవారు. చేగువేరా ఎక్కడినుంచి పోరాడుతున్నది ఎవ్వరికీ తెలియదు. చేగువేరా క్యూబా రాయబారిగా, రష్యా, చైనా తదితర అనేక దేశాలు పర్యటించిన ఆయన భారత్‌ను పర్యటించారు. ఆనాటి ప్రధాని నెహ్రూను కలుసుకున్నాడు. బానిసత్వంలో మగ్గిపోతున్న బొలీవియన్లకై పోరాటం చేయాలని చేగువేరా నిర్ణయించుకున్నాడు. చేగువేరా గెరిల్లాలతో ఒక లోయలో ప్రవేశించారు. దీనిని గమనించిన సైన్యం నలువైపులా లోయని చుట్టుమట్టి చేగువెరాను అతి దారుణంగా కాల్చి చంపారు. 1967 అక్టోబర్ 9న అమరుడైనాడు. 39ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి పోయింది . తనను చంపినా విప్లవం ఆగి పోదని ధైర్యం గా చెప్పాడు .చేగువేరా ప్రాణాలు కోల్పోయినా అనంతరం ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1997 లో అక్టోబర్ 17 న చేగువేరాను క్యూబా శాంతా క్లారా లో మళ్ళీ గౌరవం గా సమాధి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *