జగన్ ఒంటరి….

జాతీయ పార్టీల నుంచి డోర్లు క్లోజ్
సిరా న్యూస్,న్యూఢిల్లీ;
ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని వీడుతూ జగన్ ఒంటరి అవుతున్నారు. ఒక వైపు అక్రమాస్తుల కేసులు , మరో వైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాల్‌గా మారాయి. ఉన్న కష్టాలకు తోడు శ్రీవారి లడ్డు వివాదం వైసీపీ మెడకు చుట్టుకుని ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది. ఆ ఎఫెక్ట్‌తో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదెలా అంటారా? మీరే చూడండి.సింహం సింగిల్‌గా వస్తుంది. ఆ సినిమా డైలాగ్‌ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదేపదే రిపీట్ చేస్తుంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో సీనియర్లు ఒకరొకరుగా గుడ్ బై చెపుతుండటంతో జగన్‌కు సీనియర్ పొలిటీషియన్లు కరువై.. సలహాదారులే మిగులుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ను సపోర్ట్ చేసే పార్టీ కనిపించడం లేదు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అప్పుడాయనకు ఇండియా కూటమిలోని పెద్ద పార్టీలేవి మద్దతు పలకలేదు. జగన్‌కు కేంద్రంలో ఎన్డీయే కూటమి డోర్లు ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితుల్లో.. ఆయన అప్పట్లో ఇండియా కూటమి తనకు మద్దతిస్తుందని భావించారు. అయితే అది జరగలేదు.తాజాగా వైసీపీ శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ మహాపరాధంపై హిందూ సమాజమంతా భగ్గు మంటుంది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వైసీపీ నానా పాట్లూ పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో రహస్యంగా అంటకాగిన జగన్‌‌కు ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే ఆయన ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు చూశారుఅయితే ఇండియా కూటమిలో జగన్‌కి సొంత చెల్లెలు షర్మిలే పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా మారారు. ఏపీలో బలోపేతం అవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యత తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవడమూ? లేకపోతే కూటమిలో చేర్చుకోవడమో? చేస్తుందని భావించినా ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. శ్రీవారి లడ్డూ వివాదం జగన్ మెడకు చుట్టుకోవడంతో.. ఇండియా కూటమి ఆయన్ని చేర్చుకోవడం కాదు కదా.. కనీసం ఆ కూటమి పెద్దలు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి సవాలుగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని దగ్గర రానిచ్చే పరిస్థితే లేదు. త్వరలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు చూస్తే శ్రీవారి లడ్డూ వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీ షేక్‌హ్యండ్ ఇస్తే.. ఏం జరుగుతుందో ఆ పార్టీకి తెలియంది కాదువచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయంటున్నారు. జమిలి ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నీ తమ మనుగడకు ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి ఉంటుంది.. అయితే జగన్‌కి ఎన్డీఏ డోర్లు క్లోస్ అయిపోయాయి ఇప్పుడు హిందుత్వ సెటిమెంట్‌తో ఇండియా కూటమి గేట్లు ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఓవరాల్‌గా వైసీపీ సింగిల్‌గా మిగిలిపోవడం ఖాయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *