సిరా న్యూస్,విజయవాడ;
పవిత్ర తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ, నటి జత్వానీ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్ర కోణాలు, మదనపల్లి ఫైల్స్ దహనం.. ఇలా ఒక్కో వ్యవహరం ఒక్కో ఆటం బాంబులా ఆంధ్ర రాజకీయాల్లో పేలుతున్నాయి. వీటన్నింటికీ మించి షర్మిళ – జగన్ ఆస్తుల పంచాయితీ కీలక మలుపు కాగా, ఇంతలోనే రిషికొండ ప్యాలెస్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అసలు ఎందుకు.. ఇలా ఒక్కో అంశం తెరపైకి వస్తుంది అంటే.. అధికార పార్టీ వ్యూహంలో భాగమే అనే మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక టార్గెట్… వైఎస్ జగన్. గత ఐదేళ్లలో జగన్ చేసిన ఘనకార్యాలు ఇవీ అంటూ ప్రజలకు చూపించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు వైసీపీ వైఫల్యాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ, వీలున్నంత మేరకు అన్ని అంశాల్లో జగన్ ను దోషిగా నిలబెట్టేందుకు చూస్తుంటే.. జగన్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఏ వ్యవహారంలోనూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది లేదు. దాంతో.. వైసీపీ క్యాడర్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అధినేత మౌనం.. వ్యూహాత్మకమా.? ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితా.? అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు.2014లో మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయాక.. మళ్లీ వస్తాం, ఈసారి బలంగా కొడతాం అంటూ మీడియా ముందు ఆవేశంగా ప్రకటించిన జగన్.. అదే తీరుగా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేశారు. నిత్యం యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. కానీ.. ఇప్పుడు కూటమి నేతలు, వారి సోషల్ మీడియా ప్రచారంపై జగన్ తీరుకు.. సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి జగన్ ఎందుకు బలంగా కౌంట్ ఎటాక్ చేయడం లేదు అంటూ సందిగ్ధంలో పడిపోయారు. అధికారంలో ఉన్న జగన్ – ఇప్పటి జగన్ తీరుకు పొంతన లేక.. ఏం జరుగుతోందంటూ తలలు పట్టుకుంటున్నారు. తమ నాయకుడి మౌనం అర్థం కాక, అధికారపక్ష విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక సతమతం అవుతున్నారు.2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని స్థాయిలో 151 సీట్లు గెలుపొంది అధికారం చేపట్టిన జగన్.. లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల పేరుతో ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఆ సంక్షేమమే మళ్లీ పట్టం కడుతుంది అని ఆశపడి భంగపడ్డారు. ఎలా అయితే పైకి లేచారో.? అలాగే దారుణంగా కిందపడిపోయారు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్షం హోదాను సైతం దక్కించుకోలేని స్థితిలో.. ఈ ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అంటూ జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఫలితాలను జగన్ ఏ తీరుగా తీసుకున్నారో చెప్పేందుకు ఇదే మంచి ఉదాహరణ అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఓటమి బాధను జీర్ణించుకోలేక.. ఇంకా ఆ పరిస్థితుల నుంచి జగన్ పూర్తిగా బయటపడలేదని, అందుకే.. సరైన కౌంటర్ లేకుండా పోయిందంటున్నారు.కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు. అధికారంలో ఉన్నప్పుడు పదవీ బాధ్యతలను అడ్డుగా చూపి కోర్టులకు హాజరు కాలేదు. అనేక కేసుల విచారణలోనూ తీవ్ర జాప్యానికి కారణమయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోవడం, మళ్లీ కేసులు యాక్టీవ్ అవుతుండడంతో ఎలా ఎదుర్కోవాలో అని మథనపడుతున్నారంటున్నారు.. విశ్లేషకులు. అన్నీ కేసులు ఒకెత్తు అయితే.. వైఎస్ వివేకానంద హత్య కేసు మరో ఎత్తు. ఈ కేసు తిరిగి తిరిగి వైసీపీ ముఖ్య నేతలకే చుట్టుకోవడం, ఒకవేళ.. ఈకేసులో తన పాత్రపై విచారణ జరిగితే రాజకీయంగా ఎదురుకానున్న వ్యతిరేకతలు జగన్ ను నిద్రపోనివ్వడం లేదన్నది సన్నిహితుల మాట.జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన సందర్భంలో వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టీవ్ గా పనిచేసింది. జగన్.. కాలు తీసి కాలు బయటపెట్టినా విపరీతంగా హైప్ క్రియేట్ చేసింది. జగన్ ప్రతీ మాటను, చేసిన ప్రతీ వాగ్దానాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా విస్తృత ప్రచారం కల్పించింది. ఎదుటి పక్షం ఎవరైనా జగన్ పై కామెంట్ చేస్తే తీవ్రంగా విరుచుకుపడింది. అలాంటి సోషల్ మీడియా.. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా స్తబ్ధుగా మారిపోయింది. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు చేసే విమర్శలకు దీటుగా బదులివ్వలేక చతికిల పడిపోతోంది. దాంతో.. అధికార పక్షం వాదనే బలంగా ప్రజల్లోకి వెళుతుంది అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు.ఎన్నికల్లో జగన్ అద్భుత విజయం వెనుక వ్యూహాలు సిద్ధం చేసింది.. ప్రశాంత్ కిషోర్ టీం. ఎన్నికలకు రెండు మూడేళ్ల ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ టీం.. జగన్ తో కలిసి పని చేసింది. రాష్ట్రంలో విస్తృతంగా సర్వేలు చేపట్టి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుకూలంగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. పీకే టీమ్ చేసిన సోషల్ మీడియా ప్రచారం వైసీపీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. జగన్ తప్పితే వేరే వాళ్లు వస్తే అభివృద్ధి జరగదు అనే స్థాయిలో అన్ని రకాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీకే టీం సక్సెస్ అయ్యింది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలతో పాటు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను వైసీపీ వైపు మళ్లించడంలో సక్సెస్ సాధించింది. అలాంటి బలమైన, వ్యూహాత్మకమైన పీకే టీం.. ఇటీవల ఎన్నికల్లో జగన్ వెంట లేకుండా పోయింది. పీకే టీమ్ మద్ధతు లేని లోపం జగన్ వ్యూహాల్లో స్పష్టంగా కనిపించింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పీకే లేకపోతే.. జగన్ వ్యూహాలు పనిచేయడం లేదని వైరి పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.ఐ– ప్యాక్ టీంలోని కీలక సభ్యుడే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. అయినా గతంలో మాదిరిగా జగన్ టీం వ్యూహాలు ఫలించడం లేదు. ఎన్ని ఎత్తులు రచించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అవేవీ పనిచేసేలా కనిపించడం లేదన్నది వారి వాదన. ప్రజాక్షేత్రంలో ఘోర ఓటమి, సొంత పార్టీని వీడి అధికార పార్టీలో చేరేందుకు వైసీపీ కీలక నాయకులు ప్రయత్నాలు, సహా.. ఇంకా ప్రజల్లో జగన్ పై ఏర్పడిన వ్యతిరేకత తగ్గకపోవడం ఇందుకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. పైగా బంపర్ మెజారిటీతో అధికారం అందుకున్న నూతన ప్రభుత్వం.. ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుండటం జగన్ టీం వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినట్లు అవుతుంది అంటున్నారు.