మరి ఇప్పుడేమో,,,
సిరా న్యూస్,తిరుపతి;
కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసిపి నేతలు శపధం చేశారు. గత ఐదేళ్లుగా గట్టి ప్రయత్నమే చేశారు. కానీ వారు ఒకటి తలిస్తే.. ప్రజలు మరోలా భావించారు. చంద్రబాబును గెలిపించారు. ఇప్పుడు కుప్పంలో వైసిపి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది.
గత ఐదేళ్లలో ఒక బలమైన నినాదం తెరపైకి వచ్చింది. వై నాట్ కుప్పం అన్న స్లోగన్ వినిపించింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసిపి నేతలు శపధం చేశారు. ఒక్కరిద్దరు కాదు అందరిదీ అదే మాట. జగన్ సైతం కుప్పం గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. 2019లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గింది కుప్పంలో. అటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసిపి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలను దక్కించుకుంది. కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది. దీంతో వైసీపీకి ఎక్కడలేని ధీమా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆ ధీమాతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పెట్టింది వైసిపి. ఒకానొక దశలో దాడులకు తెగబడింది. అయితే అన్నింటినీ భరిస్తూ.. క్యాడర్ను సమన్వయ పరుస్తూ.. ప్రజలకు జరిగినవన్నీ చెబుతూ ముందుకు సాగారు చంద్రబాబు. ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఏకపక్షంగా విజయం సాధించారు చంద్రబాబు. వైసిపి కనుచూపుమేరలో కూడా కనిపించలేదు.కుప్పం వైసిపి బాధ్యతలను యువకుడు భరత్ కు అప్పగించారు జగన్. ఆయన నాయకత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కుప్పంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు.పాలనాపరమైన నిర్ణయాల్లో కుప్పం నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యవేక్షక బాధ్యతలు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు జగన్. పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గ పుంగనూరు కంటే కుప్పం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు పెద్దిరెడ్డి. నియోజకవర్గంలో టిడిపి శ్రేణులకు భయాందోళనకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారు. ప్రలోభాలకు సైతం గురి చేశారు. దీంతో టీడీపీ కేడర్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో చంద్రబాబు గెలవకూడదన్న లక్ష్యంతో పని చేశారు జగన్, పెద్దిరెడ్డి త్రయం. భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి ఆయనను గెలిపిస్తే తప్పకుండా మంత్రిని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చంద్రబాబును మెజారిటీతో గెలి పించారు.వై నాట్ కుప్పం అని నినాదం చేసిన ఒక్క నేత కూడా ఇప్పుడు కుప్పంలో లేరు. చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు పర్యటనలో ఇబ్బందులు పెట్టిన వారందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో చాలామంది నేతలు టిడిపిలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో వైసీపీ నేతల ప్రలోభాలతో పార్టీ వీడిన చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరుతున్నారు. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందే ఆయన మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఎమ్మెల్సీ భరత్ కూడా టిడిపిలో చేరేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. కానీ టిడిపి క్యాడర్ వ్యతిరేకించడంతో ఆయనను తీసుకోలేదు. మొత్తానికైతే కుప్పంలో వైసిపి పూర్తిగా ఖాళీ కావడం విశేషం.