సిరా న్యూస్, ఆదిలాబాద్:
+ అంగరంగ వైభవంగా లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవం..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్(Jainath) మండల కేంద్రంలో కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి(Laxmi Narayana Swamy Temple) రథోత్సవ (Rathothsavam) వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్ర ప్రారంభమై రథోత్సవ వేడుకలు రాత్రి వరకు కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా, మహారాష్ట్ర నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో జైనథ్ గ్రామం జన సంద్రంగా మారింది. ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పాటు స్వామి వారి పంచ వాహనాలైన శేషవాహనం, గరుడవాహనం, అశ్వవాహానం, హన్మత్ వాహనం, గజవాహనాలను రథంపై ప్రతిష్ఠించి, రథ ప్రతిష్ట గావించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జరిగిన రథోత్సవంలో భక్తులంతా జై శ్రీమన్నారాయణ అంటూ రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని, రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5 రోజుల పాటు జాతర…
లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం, రథోత్సవం పూర్తి కావడంతో 5 రోజుల పాటు ఆలయావరణలో జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులంత పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని ఆయన కృపకు పాతృలు కావాలని వారు కోరారు.