సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతమవుతోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ ను పెంచుకోవడంలో జనసేన ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఏపీలో కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కృతజ్ఞతగా.. సీఎం చంద్రబాబు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించిన పవన్.. పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకొనేందుకు కూడా కసరత్తు ప్రారంభించారనే చెప్పవచ్చు. అందులో భాగంగా ఇటీవల పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరగా.. వారిని సాదరంగా ఆహ్వానించారు పవన్. ఇప్పటికే బీజేపీ మద్దతు గల జనసేన పార్టీ క్యాడర్ పెంచడంపై వెనుక ఉన్న రహస్యంపై రాజకీయ విశ్లేషకులు చర్చలు సాగిస్తున్నారు.ఏపీ ఎన్నికల సమయంలో ఎలాగైనా వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా.. జనసేన అధ్యక్షులు పవన్ పూర్తి స్థాయిలో ప్రయత్నించి సఫలమయ్యారు. ఎన్నికల ముందు వరకు బీజేపీతో జతకట్టిన పవన్.. ఎన్నికల సమయానికి టీడీపీని సైతం కలుపుకొని కూటమిగా బలపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో కూటమికి విజయాన్ని అందించాయి. ఈ ఎన్నికల్లో జనసేన 22 కి 22 స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ క్యాడర్ లో ఆనందానికి అవధుల్లేవు. అలాగే రాష్ట్రంలో జనసేనకు ప్రజల మద్దతు ఉందన్న ధీమా సైతం నాయకుల్లో వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. జనసేన క్యాడర్ పై దృష్టి సారించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ నుండి ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. అయితే పార్టీ మారాలనుకున్న వారు.. టీడీపీ వైపు కాకుండా జనసేన వైపుకు మాత్రమే చూడడం విశేషం. టీడీపీ క్యాడర్ నుండి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో వైసీపీ నేతలను టీడీపీ అధిష్టానం పార్టీలోకి తీసుకొనేందుకు విముఖత చూపిస్తోంది. కానీ జనసేన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. వైసీపీ నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలుకుతోంది.ఇలా చేరికలతో జనసేన బలోపేతం అవుతుండగా.. క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ ఛోటా నాయకుల మధ్య అక్కడక్కడా కొంత విభేదాలు బయట పడుతున్నాయి. దీనికి ఉదాహరణే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని చేరిక. అక్కడ స్థానికంగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నా.. జనసేనలో చేరారు బాలినేని. ఆయన చేరికతో ప్రకాశం జిల్లాలో కొంత టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఇలా క్షేత్రస్థాయిలో జనసేన చేరికల ఎఫెక్ట్ కనిపిస్తోంది. జనసేన బలోపేతం కావడం పవన్ లక్ష్యం కాగా.. దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయా అనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే బీజేపీతో దోస్తీ గల పవన్ క్యాడర్ ను పెంచుకుంటే బీజేపీకి కూడా రాష్ట్రంలో బలం చేకూరుతుంది. అలాగే హిందుత్వ వాదాన్ని ఇటీవల పవన్ ఎక్కువగా వినిపిస్తున్నారు. అంటే బీజేపీ నుండి వచ్చిన ఆదేశాలతోనే పవన్… పార్టీ బలోపేతంపై దృష్టి సారించి, హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది.ఇలా జనసేన బలోపేతం కావడం టీడీపీ కొంత మైనస్ అనుకున్నా.. నెంబర్-2 ప్లేస్ లో ఉన్న పవన్ వచ్చే ఎన్నికల సమయానికి నెంబర్-1 అయ్యేలా పావులు కదుపుతున్నారా అనే చర్చలు జోరందుకున్నాయి. ఏదిఏమైనా బీజేపీతో సూపర్ దోస్తీ గల పవన్.. మున్ముందు ఏ అంచనాలతో పార్టీని బలోపేతం చేసుకుంటున్నారో కానీ.. టీడీపీకి మాత్రం క్షేత్రస్థాయిలో కొత్త తలనొప్పులు తెస్తుందన్న అభిప్రాయం టీడీపీ నేతల గుండా వినిపిస్తోంది. జనసేన బలాన్ని అందిపుచ్చుకొని బీజేపీ రాష్ట్రంలో అధికారిక పాగా వేయాలని ప్లాన్-బి అమలు చేస్తే.. పవన్ కి సీఎం సీటు ఖాయమే. మరి ఆ దిశ ఈ రెండు పార్టీల అడుగులు పడుతున్నాయా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.