తమిళ రాజకీయాల్లోకి జనసేనాని..?

సిరా న్యూస్,చెన్నై;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఇటీవల రాజకీయ చర్చల్లో తెగ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాలేదు పవన్ పేరు.. దేశ రాజకీయాల్లో కూడా పవన్ పేరు ఇప్పుడు తీవ్ర చర్చకు వస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం పవన్ వైఖరని చెప్పవచ్చు. మరి ఇంతలా పవన్ కళ్యాణ్ అన్నింటా వైరల్ అయ్యేందుకు దారి తీసిన పరిస్థితులలో మొదటగా.. తమిళులపై ప్రేమ కురిపించడమే. ఒకరితో విభేదం, మరొకరితో సన్నిహితంగా ఉంటూ తమిళ రాజకీయాల్లో కూడా తన హవా కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. అసలు డిప్యూటీ సీఎం పవన్ మదిలో ఏముంది ? ఎందుకు ఇంత తమిళులపై ప్రేమ కురిపిస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి ఆజ్యం పోసింది మాత్రం తిరుమల లడ్డు వ్యవహారమే. దీక్ష చేపట్టిన పవన్.. తిరుమల శ్రీవారిని దర్శించి దీక్షను విరమించారు. అలాగే తిరుపతి వేదికగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించేందుకు వారాహి సభను సైతం నిర్వహించారు. ఈ సభలో పవన్ చేసిన ప్రసంగంకు తమిళనాట వేడెక్కిందని చెప్పవచ్చు. పవన్ తన ప్రసంగంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ.. సనాతనధర్మం గురించి గతంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే విమర్శించారు. అది కూడా తమిళంలో నేనున్నాను.. సనాతనధర్మ పరిరక్షణ కోసం.. ఎవరినైనా ఎదురిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా పవన్ ప్రసంగం సాగిందఇక తమిళ సోషల్ మీడియా పవన్ ను ట్రోలింగ్ చేసే స్థాయికి వెళ్లిందంటే.. అక్కడ పవన్ వ్యాఖ్యల సెగ ఏ మేరకు తాకిందో చెప్పనవసరం లేదు. అలా చెప్పిన పవన్.. కొద్దిరోజులకు డీఎంకే బద్దశత్రువైన అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ను పొగుడుతూ.. ట్వీట్ చేశారు. ఇక డీఎంకే నుండి ట్వీట్ ల వర్షం కురిసి, ఏకంగా పవన్ ను ట్రోలింగ్ చేయగా, అందులోకి సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రకాష్ రాజ్, స్టాలిన్ కు మద్దతుగా ట్వీట్ లు చేస్తూ పవన్ టార్గెట్ చేశారు. ఇలా తమిళనాట పవన్ వ్యాఖ్యలు రచ్చ రచ్చకు దారి తీశాయి.ఇది ఇలా ఉంటే తాజాగా అన్నాడీఎంకే పార్టీ 53 వసంతాలు పూర్తి చేసుకోగా, పవన్ చేసిన ట్వీట్ తమిళ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. 53 వ వార్షికోత్సవం సందర్భంగా, పార్టీ నాయకత్వం, సభ్యులు, మద్దతుదారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దీనిని 1972 అక్టోబర్ 17న పురాణ “పురాత్చి తలైవర్” తిరు ఎంజి రామచంద్రన్ స్థాపించారు. తమిళనాడులో అన్నాడీఎంకే వేగంగా బలీయమైన రాజకీయ శక్తిగా మారింది. ఎంజీఆర్ పేదల అభ్యున్నతికి లోతుగా కట్టుబడి ఉన్నారు, ఎవరూ ఆకలితో లేరని, ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందని భరోసా ఇచ్చారంటూ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, అలాగే పన్నీర్ సెల్వం, ఇతర నేతలను కూడా ప్రశంసించారు.ఈ ట్వీట్ వెనుక, తమిళుల మైత్రికి పవన్ పాకులాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఇటీవల తమిళ నటుడు కార్తీ హైదరాబాద్ లో తన సినిమా సత్యం సుందరం ప్రమోషన్ వేదికలో పాల్గొన్నారు. అక్కడ యాంకర్ లడ్డు గురించి చేసిన వ్యాఖ్యలకు కార్తీ అడ్డుతగిలినట్లుగా ఆన్సర్ ఇచ్చారు. దీనితో కార్తీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్. కార్తీ కూడా వెంటనే స్పందించి సారీ చెప్పేశారు. ఆ సమయంలో కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ తమిళ సోషల్ మీడియా పవన్ తప్పు చేశారంటూ కోడై కూసింది. దీనితో పవన్ కూడా మళ్లీ వివరణ ఇచ్చుకున్నారు. అలా తమిళుల చేత కొంత వ్యతిరేక పవనాలు వీయించుకున్న పవన్.. ఆ పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా పొలిటికల్ అనలిస్టులు తెలుపుతున్నారు.ఏదిఏమైనా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్.. అన్నాడీఎంకేకు మద్దతుగా నిలిచినప్పటికీ, తమిళనాట ఏదో స్కెచ్ వేస్తున్నారని, అందుకే అన్నాడీఎంకే మైత్రి కోసం పాకులాడుతున్నట్లు గాసిప్స్ ఊపందుకున్నాయి. మరి ఇది వాస్తవమో.. కాదో కానీ పవన్ ట్వీట్ మాత్రం రాజకీయ చర్చలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *