సిరా న్యూస్, ఆదిలాబాద్
అసత్య ప్రచారాలు చేయడానికే యాత్రలు
* తెలంగాణలో అభివృద్ధిని విస్మరించిన కేంద్రం
* ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చెంత వరకు పోరాడుతాం
* ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగురామన్న
తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కేంద్రం పరిధిలోని ఎటువంటి అభివృద్ధి పని జరగలేదని ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగురామన్నఅన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కోటి 62 లక్షల కోట్ల బాకీని సామాన్య ప్రజలపై మోపన ఉందని , అలాగే సిసిఐ పరిశ్రమ ఎయిర్ పోర్టు , అదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ తో పాటు చెప్పుకోడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ లో బిజెపి నాయకులు చేపట్టలేరని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలోనే బీజేపీ నేతలకు యాత్రలు గుర్తుకు వస్తాయని, కేవలం అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయడానికే యాత్రలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ నుండి పన్నుల రూపంలో కేంద్రానికి కట్టిన దాని కంటే… రాష్ట్రం కోసం కేటాయించిన నిధులు చాలా తక్కువని తెలిపారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ గురించి కూడా స్థానిక ఎంపీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదురుగా అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. రైల్వే లైన్ పనుల గురించి ఇప్పటికీ సర్వే మొదలు పెట్టలేదని, డీపీఆర్ ఇవ్వలేదన్నారు. అత్యధిక ఆదాయం ఇస్తున్న దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్ లో కేంద్రం మొండిచేయి చూపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్థానిక సంస్థల్లో ఒక్కటై పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కెసిఆర్ పై బీజేపీ విమర్శలు చేయడం అందుకు నిదర్శనమన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా కెసిఆర్ నల్గొండ నిర్వహించిన సభ ద్వారా అటు మోడీకి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నయ్యాన్నారు..ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చెంత వరకు ప్రజల పక్షాన నిలబడుతూ వారికి అండగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో బి ఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ, జోహర్ బాయ్, అశోక్ స్వామి, శ్రీనివాస్, రామ్ కుమార్, నవాతే శ్రీనివాస్, ఆసిఫ్, తదితరులు నాయకులు పాల్గొన్నారు.