తిరుమల లడ్డూలు భలే…భలే
సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా మందికి మక్కువ. పరమపవిత్రంగా భావించే భక్తు లడ్డూలు ఎక్కువ తీసుకురమ్మని తిరుమల వెళ్లే భక్తులకు చెబుతుంటారు. రానురాను దిన్నో స్టేటస్ సింబల్‌గా కూడా మార్చేశారు. ఈ గిరాకీని అడ్డం పెట్టుకున్న దళారీలు తిరుమల లడ్డుతో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు.కొండపై తిష్టవేసి ఫేక్ ఐడీలు, ఫేస్ మనుషులతో తిరుమల లడ్డూలను కొనుగోలు చేసి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాటిని అరికట్టి స్వచ్ఛమైన తిరుమల లడ్డూలను భక్తులు అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. స్వామి వారి లడ్డూలు కావాలంటే దళారులను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు టీటీడీ కొత్త విధానాలు తీసుకొస్తుంది.తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు లడ్డూలు కావాలంటే భక్తులకు టీటీడీ ఒక ఉచిత లడ్డూ, రూ.50 లడ్డూ అదనంగా అందిస్తుంది. ఇక అధికంగా కావాలంచే మాత్రం లడ్డూల నిల్వ బట్టి అందిస్తున్నారు. ఇక బయట వ్యక్తులు లడ్డూలు కొనాలంటే మాత్రం ఆధార్ కార్డు కు రెండు లడ్డూలు అందిస్తామని ప్రకటించారు. దీని ద్వారా తిరుమలకు రాలేని భక్తులు లడ్డూలు కావాలంటే దళారులను ఆశ్రయిస్తున్నారని టీటీడీ గుర్తించింది. తిరుమలలో లడ్డూలు అధికంగా పొందుతున్న వారిపై కూడా దృష్టి పెట్టింది. మరోవైపు టీటీడీలో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు కూడా ఎన్ని లడ్డూలు పొందారని ఎక్కువ లడ్డూలు పొందిన వారిపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురి బ్యాంకు స్టేట్ మెంట్లు తీసుకురావాలని విజిలెన్స్ అధికారులు తెలిపారుతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కావాలనే భక్తులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు టీటీడీ స్థానికాలయాలతో పాటు సమాచార కేంద్రాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమైంది. టీటీడీ స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలయాగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లిహిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూలు విక్రయాలు జరుగుతున్నాయి. బెంగళూరు, వేలూరు లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో మొత్తం ఈనెల 2వ తేదీ 50 వేల లడ్డూలు, 3వ తేదీ 13 వేలు, 4వ తేదీ 9500 లడ్డూలు విక్రయాలు జరిగాయని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. లడ్డూ ప్రసాదాలు కావాల్సిన భక్తులు అక్కడ కూడా లడ్డూలను పొందవచ్చు.శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యిని టీటీడీ కొనుగోలు చేసింది. బెంగుళూరుకు చెందిన కర్ణాటక కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (KMF) నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు పూజ చేసి బుధవారం తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నియమించిన అధికారులు లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాణ్యమైన నెయ్యి లేకపోవడం వల్ల లడ్డూ రుచి తగ్గిందని గుర్తించారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేసినట్లు నిర్థారణ చేసుకున్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదు, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇందులోని సిబందికి మైసూర్ లో శిక్షణ ఇస్తున్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్ డిఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్‌కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొ.స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డా.మహదేవన్ ఉన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశ నిర్ధేశం చేసింది. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని, కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. నెయ్యి నాణ్యత, రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించారు. కొత్త టెండర్ షరతు ప్రకారం, డెయిరీలు నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటలపాటు ఎంపిక చేసిన స్టార్టర్ కల్చర్‌తో వెన్నని పక్వానికి తీసుకురావాలి. ఇంకా డెయిరీలు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను 120 డిగ్రీలు సెంటిగ్రేడ్ లో 2 -5 నిమిషాలు వేడి చేయాలి. కర్ణాటక కో అపరేటివ్ మిల్క్ ప్రాడెక్ట్ (నందిని నెయ్యి) ని ఆమోదించి, నేరుగా కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా రుచికరమైన లడ్డూలు భక్తులు అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇప్పట్టికే లడ్డూ తయారీ చేసి నాణ్యత కూడా పరిశీలన చేసారని అధికారుల సమాచారం.