-నేడు ఆయన జయంతి
సిరా న్యూస్;
భారత స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ… అదేవిధంగా దేశ స్వాతంత్రానంతరం, నిరంకుశ నిజం పాలన ముగిసిన తర్వాత తెలంగాణ జెండాను ఎత్తిన తొలి తరం నేతల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పదవులను గడ్డిపోచలా భావించారు. తొలి దశ ఉద్యమంలో హింసాకాండను నిరసించి, కాంగ్రెస్ ప్లీనరీలో నిలదీశారు. కాసు కేబినెట్ నుంచి తప్పుకుని ప్రత్యేక తెలంగాణకోసం మంత్రి పదవి వదులుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఎదుర్కొని, తన నివాసం ‘జలదృశ్యం’లోనే ఎమ్మెల్యేలను కూడగట్టారు. ఈ జల దృశ్యమే మలి దశ పోరుకి వేదికయ్యింది.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు రోజూ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిండ్రు. వారిపై పోలీసులు, మలబార్ నుంచి వచ్చిన మిలటరీ, గూర్ఖా రైఫిల్స్ సైన్యం జరిపిన కాల్పుల్లో అభం శుభం ఎరుగని పిల్లలు, విద్యార్థులు అమరులయ్యిండ్రు. ప్రతి పాఠశాల, కళాశాల ఓపెన్ ఎయిర్ జైలుగా మారింది.
మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి:
విద్యార్థులపై పోలీసుల కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో గొంతు విప్పారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఆయన.. పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి వదులుకున్న మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969లో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా సమితి యాక్షన్ కమిటీకి బాపూజీ శాశ్వత ఆహ్వానితుడు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాపూజీ అధ్యక్షతన తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీగా మారింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ కూడా చేసింది.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009 రెండు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.