కొండాకు పదవీ గండం…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మూడు రోజులుగా దుమారం రేపుతున్నాయి. మొదట కొండా సురేఖ ఫొటోను కొంత మంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. దీనిని బీఆర్‌ఎస్‌ నేతలే చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. దీనిపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించకపోవడంతో కొండా సురేఖపై సానుభూతి పెరిగింది. అయితే ఆ సానుభూతిని మరింత పెంచుకునేందుకు కొండా సురేఖ వేసిన స్టెప్‌ బూమరాంగ్‌ అయింది. కేటీఆర్‌ను ట్రోలింగ్‌కు బాధ్యుడిని చేసి ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయాలని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో అప్పటి వరకు కొండా సురేఖపై ఉన్న సానుభూతి మొత్తం పోయింది. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై మంత్రిపై తిరుగుబాటు చేసింది. ఎక్స్‌ వేదికగా ట్వీట్లతో దాడిచేశారు. దీంతో అప్రమత్తమైన కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవరినీ నొప్పించాలని వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్‌ వైఖరి బయటపెట్టడానికి మాత్రమే అలా చేశానని వెల్లడించారు. అయినా విమర్శలు ఆగడం లేదు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి వెళ్లాయి. దీంతో మంత్రి ఒక్కరికే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారడంతో కొండా తీరుపై హైకమాండ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొండా సురేఖను మందలించారని తెలిసింది. మరోవైపు ఇండస్ట్రీపైనా ఆయన సీరియస్‌గా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్‌ చేస్తూ సురేఖ వ్యాఖ్యలపై అమల అక్కినేని ఆగ్రహంతో ట్వీట్‌ చేయడంతో ఈ అంశం హైకమాండ్‌ దృష్టికి వెళ్లింది.అక్కినేని అమలకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫోన్‌ చేసినట్లు తెలిసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా చెడ్డగా, అవమానకరంగా ఉన్నాయని, అక్కినేని కుటుంబం ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆమె కూడా భావించారు. తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డితో కూడా ప్రియాంక గాంధీ మాట్లాడారని, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే బాగుంటుందని సూచించారని తెలిసింది. మంత్రి పదవి నుంచి తప్పిస్తే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని భావించారని సమాచారం. ఈ సందర్భంగా సురేఖ వ్యాఖ్యలకు దారితీసిన అసలు కారణాలను రేవంత్‌ రెడ్డి ఆమెకు వివరించినప్పటికీ ప్రియాంక గాంధీ అంగీకరించలేదని తెలిసింది.కొండా సురేఖను తప్పించి ఆ పదవిని అదే సామాజికవర్గానికి చెందిన మహిళతో భర్తీ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రియాంక సూచించినట్లు తెలిసింది. కొండా సురేఖ కామెంట్స్‌ పెద్ద దుమారానికి దారి తీస్తాయని ఊహించని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా తేరుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖతో ప్రకటన ఇప్పించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తమ కుటుంబంపై కొండా చేసిన ఆరోపణల విషయాన్ని అక్కినేని అమల ఎక్స్‌ ద్వారా ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాంధీకి ట్యాగ్ చేశారు. అంతే కాకుండా ఓ కేంద్ర మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కొండా సురేఖ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పెద్దలు అసలేం జరిగిందో రిపోర్ట్‌ పంపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబంపై కామెంట్ చేశారని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని పీసీసీ నేతలు కొండా సురేఖను వెనకేసుకొచ్చేలా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.ఓ కేంద్ర మాజీ మంత్రి ఫిర్యాదుతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పీసీసీ నివేదికతో ఏ మాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని అమలతో ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్‌లో మాట్లాడి జరిగిన విషయంపై ఆరా తీసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం బాలీవుడ్‌కు పాకడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉన్నందున, పార్టీకి జరిగిన నష్టాన్ని నియంత్రించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని హైకమాండ్‌ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *