Land Kabza: పెంబిలో రూ. కోటి విలువ చేసే జీపీ స్థలం కబ్జా!?

సిరా న్యూస్, బ్యూరో–ఇన్‌–చీఫ్‌ (నిర్మల్‌):

పెంబిలో రూ. కోటి విలువ చేసే జీపీ స్థలం కబ్జా!?

+ భారీ మొత్తంలో చేతులు మారినట్లు పుకార్లు

+ చోద్యం చూస్తున్న అధికారులు

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజక వర్గం ,పెంబి గ్రామ పంచాయతీ స్థలాన్ని కొంత మంది కబ్జా చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పెంబి నుండి ఖానాపూర్‌ వెళ్ళే అర్‌అండ్‌బీ ప్రధాన రహాదారి పక్కనే ఉన్న ఈ గ్రామ పంచాయతీ స్థలంలో ఏళ్లుగా తాగు నీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన మోటార్ బావి కోసం షెడ్డు ఉంది. దీంతో కొంత మంది ఈ స్థలం పై  కన్నేశారు. అప్పట్లోనే దీన్ని కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే కాంగ్రేస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు, న్యాయవాది, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు సల్ల ప్రశాంత్  రెడ్డి హైకోర్ట్‌కు వెళ్లి స్టే తీసుకొని రావడంతో పనులు నిలిచిపోయాయి. కాగా నాయకులు, జనాలంత అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో ఉండగా, ఈ స్థలంపై కన్నేసిన ప్రైవేటు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో గుట్టుచప్పుడు కాకుండా స్థలాన్ని తమ పేరిట చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే అప్పట్లో ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా అడ్డుకున్న పలువురు కాంగ్రేస్‌ నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉండి కూడ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారీ తీస్తోందని ప్రజలు వాపోతున్నారు. దాదాపు రూ. కోటి విలువ చేసే ఈ స్థలం కోసం భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చేనే కంచె మేస్తే అన్న చందంగా, రక్షకులే భక్షకులై ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నత అధికారులు ఈ స్థలం విషయంలో జోక్యం చేసుకొని, ప్రజల్లో నెలకొకొన్న అపోహలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏళ్ళుగా జీపీ ఆధీనంలో ఉన్న ఈ విలువైన స్థలాని తిరిగి జీపీకి కట్టబెట్టి, న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *