సిరా న్యూస్,హైదరాబాద్;
అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో కొండా సురేఖ వెనక్కి తగ్గినా.. కోర్టు కేసులు మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రికి నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. మరోవైపు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించిన కేటీఆర్ పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ చేపట్టింది.తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఒకే టైమ్‌లో రెండు పరువు నష్టం దావా కేసులు చుట్టుముట్టాయి. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.. నాంపల్లి కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 23కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల ఎనిమిదిన నాగార్జునతో పాటు సాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కోర్టు.. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ని ఈ రోజు నమోదు చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో..అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. అయితే కొండా సురేఖ కామెంట్స్‌పై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు..అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు వందకోట్లకు పరువు నష్టం దావా వేశారు..నాగార్జున.మరోవైపు ఇదే వ్యవహారంలో మాజీమంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు..తదుపరి విచారణను ఈ 14కు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు తనను ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారుమాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల పేర్లను ఆమె ప్రస్తావించారు. ఇందులో భాగంగా సమంత, నాగచైతన్య విడాకుల అంశంలో నాగార్జున, కేటీఆర్ పాత్ర అంటూ వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడారు.ఒకదశలో ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు మంత్రి సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో వెనక్కి తగ్గిన మంత్రి, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల బీఆర్ఎస్ ఆగ్రనేత చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనన్న మంత్రి, సమంత మనోభావాలను దెబ్బతీయడం మాత్రం కాదని క్లారిటీ ఇచ్చేశారు. సమంత, స్వయంశక్తితో ఎదిగిన తీరు తనకు ఆదర్శమని మంత్రి సురేఖ అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న తమపై మంత్రి వ్యాఖ్యలు తీవ్రంగా బాధపెట్టాయని పేర్కొన్న అక్కినేని నాగార్జున, నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో ఆరోపించిన కేటీఆర్..మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్న కేటీఆర్.. కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను..9ఏళ్లు మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించానని.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అవార్డులు, పెట్టుబడులు తెచ్చానని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా 2020లో అవార్డు తీసుకున్నానని.. అలాంటి తనపై రాష్ట్రమంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు తీవ్ర భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. BNS 356సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని కోరారు.