బీఆర్ఎస్ ప్లాన్ ఏంటీ…
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓట్లేయలేదు. ఇక ప్రధాని ఎవరు అన్న ప్రాతిపదికగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు ” అని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది రాజకీయ విమర్శ కాదు. నిజంగానే వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్. రాష్ట్ర స్థాయిలోనే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించలేదు. మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎంపీ సీట్లలోఎందుకు ప్రజలు ఓట్లేస్తారు ? వారికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పి కన్విన్స్ చేస్తుందన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన విషయంగా మారింది. భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఓ సారి ఓడిపోయిన వెంటనే ఎన్నికలు ఎదుర్కోవడం ఏ పార్టీకి అయినా చిన్న విషయం కాదు. మళ్లీ పరాజయం ఎదురైతే కోలుకోవడం కష్టం. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి దాదాపుగా అసాధ్యం. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమయ్యారు. తెలంగాణలో 2014లో జమిలీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగాయి. 2018లో కేసీఆర్ ఆరు నెలలు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జమిలీగా జరిగితే జాతీయ అంశాల ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుందని.. అదే జరిగితే తనకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుకు వెళ్లారు. మంచి ఫలితం సాధించారు. రెండో సారి గెలిచిన ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయవచ్చని అనుకున్నారు. సారు కారు పదహారు నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. నాలుగు సీట్లు బీజేపీకి, మూడు సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చారు. ఒక సీటు మజ్లిస్ ఖాతాలో ఎలాగూ పడుతుంది. అంటే.. బీఆర్ఎస్ నెంబర్ 9 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. కానీ ఈ సారి అధికారంలో లేదు. ఘోర పరాజయాన్ని ఎదుర్కొని.. ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళ్తుంది. ఓ వైపు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్.. మోదీ మానియా ఇంకా ఉందని హడావుడి చేస్తున్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్ఎస్కు అంత సులువు కాదు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు. చేవెళ్లే నియోజకవర్గంపై పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు.. రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం తేలిక కాదని.. కానీ మనకు అసెంబ్లీ ఎన్నికల్లో చేవె్ళ్ల పరిధిలో లక్ష ఓట్లకుపైగా మెజార్టీ వచ్చినందున..దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ వేరు.. లోక్ సభ ఎన్నికల ఓటింగ్ వేరని కేటీఆర్ కు తెలియనిదేమీ కాదు. పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది.