సిరా న్యూస్,నల్గోండ;
తెలంగాణలో రైతాంగానికి సాగు కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండు వ్యవసాయ సీజన్లను రైతులు నష్టపోయారు. ఈ సారి రుతు పవనాలు సరైన కాలంలోరాలేదు.రాష్ట్రంలో వర్షాలు ఒకింత ఆలస్యం అయినా.. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ల వల్ల ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. కాల్వల్లో నీరు పారుతోంది. చెరువులు కుంటలు పూర్తిగా జల కళతో ఉట్టిపడుతున్నాయి.నీరు ఉండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లోకి దిగినా వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన సాగు పెట్టుబడుల్లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన వ్యవసాయ పెట్టుబడుల సాయం ‘ రైతు భరోసా ’ ఇంకా అందలేదు. 2018 డిసెంబరు నుంచి 2023 డిసెంబరు దాకా రైతుల పేరున ఉన్న రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మూడు విడతల్లో రుణాలు మాఫీ చేశామని ప్రకటించింది. అయినా, ఇంకా వేలాది మంది రైతులు అర్హులు అయినా పంట రుణాలు మాఫీ కాలేదు. ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉన్న ప్రభుత్వం రైతు భరోసాను విస్మరించిందన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ రైతు బంధు ’ పేర పెట్టుబడుల కోసం ఒక ఎకరాకు, రూ.5వేల చొప్పున ఏటా రూ.10వేలు సాయం చేసేది. కాంగ్రెస్ తమ ఎన్నికల హామీల్లో బాగంగా ప్రధాన హామీగా ఇచ్చిన రైతు భరోసాలో ప్రతీ ఎకరాకు రూ.7500 చొప్పున ఏడాదికి రూ.15వేలు పంట పెట్టుబడి సాయంగా అందిస్తామని పేర్కొంది.రైతు బంధు పేరును అయితే మార్చి రైతుభరోసాగా పేర్కొన్నది కానీ, ఇంకా సరైన విధివిధానాలు రూపొందించలేదు. ఎన్ని ఎకరాల వరకు సాయం అందించాలి..? ఎందరికి అందించాలి..? వంటి వివరాలు సేకరిస్తోంది. గతంలో రైతు బంధు కింద సాగుయోగ్యం కానీ భూములకు, సాగులోలేని భూములకు, కొండలు, గుట్టలతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్లుగా మారిన వ్యవసాయ భూములు, ఫామ్ హౌజ్ లకు కూడా ధనవంతులైన వారికి రైతు బంధు అందిందన్న విమర్శలతో రైతు భరోసా ను కేవలం అర్హులకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, రుణ మాఫీ కార్యక్రమంతో రైతు భరోసా అటకెక్కినట్లు కనిపిస్తోందన్న అభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు భరోసా అందాల్సిన రైతుల సంఖ్యపై వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. ఉమ్మడి నల్గొండ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 11.10లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 21 లక్షల ఎకరాల సాగు భూమికి సాయం అందాల్సి ఉంది.నల్గొండలో 5.50లక్షల మంది రైతులు, సూర్యాపేట జిల్లాలో 3.50లక్షల మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.10లక్షల మంది రైతులు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించడానికి ఎలాంటి పరిమితి (సీలింగ్) లేదు. కానీ, రైతుభరోసాలో 5, 10, 15 ఎకరాల కేటగిరీలుగా విభజించినట్లు చెబుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదకొండు సార్లు రైతు బంధు అందించారు. కాగా, ఉమ్మడి జిల్లాకు రూ.1450 కోట్ల బడ్జెట్ అవసరం అయ్యేది. ఇపుడు కొత్త ప్రభుత్వం ఎకరాకు రూ.7500 సాయం అందించనున్న కారణంగా జిల్లా రైతు భరోసా కోసం రూ.2175 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రతీ సీజన్ కు అదనంగా రూ.725 కోట్లు అదనంగా అవసరం పడుతోంది.దీంతో రైతుల ఖాతాలను వడబోసి, అర్హులను గుర్తించే పనిని జరుగుతోంది. రైతు బంధు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నివేదిక కూడా అందించింది. నిదుల కొరత లేదా, రైతు రుణ మాఫీపైన మాత్రమే ద్రుష్టి పెట్టడం వల్ల రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం అందించడంలో ఆలస్యం జరుగుతోందని అనిపిస్తోందని, వ్యవసాయ సీజన్ పూర్తయ్యాక సాయం అందిస్తారా అన్న ప్రశ్నలు రైతు సంఘాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.