సిరా న్యూస్,కరీంనగర్;
కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి… ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం తథ్యమని అందరూ అనుకున్నారు. బిజెపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 8 సీట్లతోనే ఆ పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గోషా మహల్ మినహా సిట్టింగ్ కోల్పోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తల్లోజు ఆచారి వంటి వారు ఓడిపోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో అంబర్ పేట లో బిజెపి అభ్యర్థి పరాజయం పాలవడం వంటి ఘటనలు ఆ పార్టీని ఇప్పటికీ అంతర్మథనంలో కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువగా సీట్లు, ఓట్లు సాధించినప్పటికీ.. బిజెపి అధికారంలోకి రావాలి అంటే అది సరిపోదు.బీసీ అజెండా తో ఈసారి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లిన భారతీయ జనతా పార్టీకి ఆశించినంత మేర ఓటు బ్యాంకు బదిలీ కాలేదు. అది జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి అంశం మీదనే భారతీయ జనతా పార్టీ తుది వరకు పని చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన నేపథ్యంలో… భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి విధానాన్ని అత్యంత పకడ్బందీగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అవసరమైతే దీనిని ప్రధాన రాజకీయ అంశంగా తెరపైకి తీసుకురావాలి. ఇక ఎస్సీ ఉప వర్గీకరణ విధానాన్ని కూడా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలి. ఇది దళిత సామాజిక వర్గం చిరకాల వాంఛ. ఇప్పటివరకు ఎన్నికైన ప్రభుత్వాలు దళితుల ఉప వర్గీకరణ సంబంధించి ఒక పకడ్బందీ నిర్ణయం అంటూ తీసుకోలేదు. మాదిగల విశ్వరూప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళితుల వర్గీకరణ పై నిర్ణయం వెలువరించడం.. మందకృష్ణ మాదిగ సమక్షంలో దానిని ప్రకటించడం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు.. అయితే ఈ ఉప వర్గీకరణ విధానాన్ని దళితుల్లో క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీకి మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.. ఇవి మాత్రమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షణ, విస్తృతి ఒక ప్రధాన అంశంగా బిజెపి ప్రకటించాల్సిన అవసరం ఉంది. హిందువుల పార్టీ అని చెప్పుకునే బిజెపి 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని విస్మరించడం కొంతమందిని ఇబ్బందికి గురి చేసింది. ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి కనుక ఈ విషయం మీద అత్యంత సీరియస్గా దృష్టి సారించి ఉండి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. గత పది సంవత్సరాలలో బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకుంది.