సిరా న్యూస్;
-నేడు ఆమె వర్ధంతి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం.. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కర్విరాల కొత్తగూడెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో మల్లుస్వరాజ్యం జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. ఐదో తరగతి వరకే చదువుకున్న ఆమె.. తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో పోరాట పంథాలోకి వచ్చారు. 1945-48 మధ్య మహోజ్వలంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలిచారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించేలా సభలు నిర్వహించేవారు. ఆనాటి రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటలతో ఉర్రూతలూగించే ఉపన్యాసాలతో మహిళల్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో స్వరాజ్యం పనిచేశారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలిమహిళగా స్వరాజ్యం పేరుతెచ్చుకున్నారు. మహిళా కమాండర్‌గా పనిచేశారు. ఆమెను పట్టించిన వారికి నైజాం సర్కార్ పదివేల రివార్డు కూడా ప్రకటించింది. సాయుధ పోరాట కాలంలో మల్లు స్వరాజ్యంతో పాటు మూడువందల మంది మహిళలు మేజర్ జైపాల్ సింగ్ ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ, ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు (1978, 1983లలో) తుంగతుర్తి శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి (వీఎన్ ) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన2004 డిసెంబర్ 4న మరణించారు. వీరికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి (వైద్యుడు), మల్లు నాగార్జున రెడ్డి (న్యాయవాది) ఉన్నారు. కుమార్తె భాజపాలో ఉండగా.. చిన్న కుమారుడు నాగార్జున రెడ్డి సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమె ఆత్మకథ నా మాటే తుపాకీ టూటా (నా మాట ఒక బుల్లెట్) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 2019లో ప్రచురించింది. స్వరాజ్యం తన 91వ ఏట 19 మార్చి 2022న హైదరాబాద్‌లో బహుళ అవయవ వైఫల్యంతో మరణించింది. ఆమె శరీరం వైద్య పరిశోధన కోసం నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేయబడింది.