21 ఫిబ్రవరి నుంచి మేడారం

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. 21 ఫిబ్రవరి 2024 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులను విడుదలకు ఆమోదం తెలిపింది. నిధులు కూడా విడుదల అవడంతో.. భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు అధికారులు. 2022లో మేడారం జాతర జరగగా రెండేళ్ల తరువాత మళ్లీ 2024లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహా వన జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి రోజున మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతరను ప్రారంభిస్తారు గిరిజన పూజారులు. కాగా, జాతరలో భాగంగా తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఆ తరువాతి రోజు చిలకలగుట్ట వద్ద నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దె పైకి తీసుకువచ్చి ప్రతిష్ఠాపన చేస్తారు. మూడో రోజు అమ్మవార్లు భక్తుల పూజలు అందుకుంటారు. నాలుగవ రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.నాలుగు రోజులు పాటు జరిగే ఈ వన జాతరకు దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులతో పాటు.. భక్తులు భారీగా తరలి వస్తారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యతో మేడారం జాతరకు తరలి వస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలో ప్రవహిస్తున్న జంపన్న వాగులో స్నానమాచరించి.. దేవతా మూర్తులను దర్శించుకుంటారు భక్తులు. బంగారం(బెల్లం)ను నైవేథ్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. జాతర కోసం 21 శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయనున్నారు. జాతర నేపథ్యంలో వైద్య శిబిరాలు, విద్యుత్ సరఫరా, కళ్యాణ కట్టలు, పార్కింగ్ స్ధలాలు, దేవతా మూర్తుల దర్శనానికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. జాతరకు రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *