సిరా న్యూస్,హైదరాబాద్;
సెప్టెంబర్ 17 న జరిగిన విలీన స్పూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణ సాధనగా ఉద్యమకారుల ప్రయాణం సాగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ ప్రో కోదండరామ్ అన్నారు. ఆ ప్రయాణంలో భాగంగానే గత ఎన్నికల్లో మార్పు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర జనసమితి పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమమని.. ప్రజల ఆకాంక్షను సాధించే వరకు తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా ప్రో కోదండరామ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం అయిన తర్వాత మొట్ట మొదటిసారిగా తెలంగాణలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారని కోదండరామ్ తెలిపారు. తెలంగాణ విలీన ఉద్యమం యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా జరిగిందన్నారు. నిజాం రాచరిక పాలనను అంతం చేసే లక్ష్యంతో ప్రజలే పోరాటం చేశారని చెప్పారు