సిరా న్యూస్,హైదరాబాద్;
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర రథసారధి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభకాంక్షలు. గత రెండేండ్లుగా భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణ రాష్ట్రానికి విమోచనం లభించిన రోజు.
వేలాది మంది ప్రజలు వీరోచిత పోరాటం చేసి అనేక త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా 1947 ఆగస్టు 15కి స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. మన తెలంగాణ రాష్ట్రానికి 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నవాబు పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేశారు. నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాల్లోకి వెళ్లి స్త్రీల మీద అత్యాచారాలు, లూటీలు చేసి అరాచకాలకు పాల్పడ్డారు. భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టి నిజాం సైన్యాన్ని ఓడించి, తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేయడం జరిగింది. నేటి సెప్టెంబరు 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. అందుకే, చాలా పవిత్రమైన రోజు. వినాయక నవరాత్రి ఉత్సవాలను దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. అయితే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వంగా ఉన్న, మతోన్మాద మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయి. మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ, దివాళాకోరు రాజకీయాలతో తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చర్యలను తిప్పికొట్టాలని అన్నారు.