సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి.. హైదరాబాద్‌ను మొత్తం 4 కార్పేషన్లుగా విభజిస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత నలుగురు మేయర్లను ఎన్నుకుంటారని వివరించారు.హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ ని 4 కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. రాబోయే ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నగరాన్ని ప్రపంచపటంలో ఉంచేందుకు రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగర రూపు రేఖలు మారిపోతాయని మంత్రి వివరించారు. దాదాపు రూ.30వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తోందన్నారు.మరో రెండు నెలల్లో రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని.. దీనివల్ల హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మూసీ కంటే విషపూరితమైన సబర్మతిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించే విధంగా మార్చారని మంత్రి గుర్తు చేశారుపరిశ్రమల నుంచి వచ్చే రసాయనాల తోపాటు మురికి నీరంతా మూసీలోకే వస్తోందని మంత్రి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మూసీ సుందరీకరణ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని.. గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని వివరించారు.మూసీ ప్రక్షాళన అంశం ఇప్పటికే రాజకీయ మంటలు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా నిలుస్తోంది. మూసీ రివర్ బెడ్ లోని ఆక్రమణలను తొలగించడం, మూసీ మురుగు నీటి శుద్ధీకరణ, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షల కోట్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. మూసీ నదిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఉన్నారు.ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీటిని శుద్ధి చేసి, గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని అధికార కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.