సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
కాంగ్రేస్ పాలనలో అర్హులందరికి సంక్షేమ పథకాలు
– ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
+ దళారులను నమ్మి మోసపోవద్దని సూచన
+ త్వరలో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
+ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచన
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడ గ్రామంలో ఆదివాసి కొలం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు డోలు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలు, పూలమాలలతో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతున్నదని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనీ అన్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని, త్వరలో అన్ని గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకొనిరావాలని సూచించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఇక్కడ అందరికి సమాన హక్కులు, స్వేచ్చ లభిస్తుందన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషీ చేస్తోందని ఆయన అన్నారు. కాగా ఫారెస్ట్ అధికారులు, చిన్న చిన్న పనులకు అడవులకు వెళ్లే ప్రజలను ఇబ్బందులు గురి చేయొద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి, స్థానిక సర్పంచ్ భీంరావు, పార్టీ మండల అధ్యక్షుడు ఉత్తం, పట్టణ అధ్యక్షులు జహిర్, సేవాదళ్ మండల అధ్యక్షులు మాణిక్ రావు, నాయకులు సోమోరే నాగోరావ్, జితేందర్, మసూద్, తదితరులు పాల్గొన్నారు.