సిరాన్యూస్, ఉట్నూర్
మంచినీటి పై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మంచినీటి వినియోగంపై గ్రామ మంచినీటి సహాయకులు అవగాహన కల్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరంలో ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు.మనిషికి అనేక వ్యాధులు కలుషిత నీటి వల్ల సంక్రమిస్తాయన్నారు.శుద్ధ జలంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం గ్రామాలలో సరైన రీతిలో నీటిని అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మిషన్ భగీరథ నీటి ద్వారా కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేర వేసేలా గ్రామ మంచినీటి సహాయకులు కీలక పాత్ర పోషించాలన్నారు.ప్రజలు మిషన్ భగీరథ నీటిపై ఉన్న అపోహలను తొలగించుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి స్వచ్ఛమైన నీటిని శుద్ధి చేసేందుకు అనేక యంత్రాలను ఉపయోగించుకొని రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.గ్రామాలలో మంచినీటి ట్యాంకులలో,బోరింగ్ లలో గల నీటిని ప్రతిరోజు టెస్ట్ చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకోరావాలని,ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, గ్రామ మంచినీటి సహాయకులు తదితరులు పాల్గొన్నారు.