పోటీకి దూరమంటున్న ఎంపీలు

సిరా న్యూస్,విశాఖపట్టణం; 
ఎంపీలుగా పోటీ చేసేందుకు వైసిపి నేతలు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు ఈసారి భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండడమే ఎందుకు కారణం. ఒకప్పుడు ఎంపీ అంటే గౌరవం,మర్యాద. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ అంటే ఉత్సవ విగ్రహంగానే మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో వీలు పెట్టడానికి ఎంపీ కి వీలు లేదు. పైగా ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా వైసీపీ హై కమాండ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని చేసి ఎంపీగా ఉండడం అవసరమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.వచ్చే ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వారి మనసంతా అసెంబ్లీ సీట్లు పైన ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాలని ఎక్కువమంది భావిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేగా ఉన్నా చాలు అన్న భావనకు వచ్చారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉంటే.. అందులో దాదాపు 15చోట్ల కొత్త వారిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ స్థానానికి కూడా పెద్దగా డిమాండ్ లేదని టాక్ నడుస్తోంది. ఎవరైనా ఆసక్తి చూపితే రూ. 20 కోట్లు వరకు సమకూర్చుకోగలరా అన్న ప్రశ్న హై కమాండ్ నుంచి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తామంత ఖర్చు చేయలేమని కొంతమంది ముఖం మీద చెప్పేస్తున్నారు. దీంతో బలమైన అభ్యర్థుల కోసం వైసిపి హై కమాండ్ అన్వేషిస్తోంది.ప్రస్తుతానికి మచిలీపట్నం,రాజంపేట, కడప స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లకు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే వారంతా దాదాపు సొంత మనుషులే. అయితే మిగతా చోట్ల మాత్రం కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో.. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎంత మాత్రం ముందుకు రావడం లేదు. అక్కడ బలమైన అభ్యర్థుల కోసం వైసిపి హై కమాండ్ జల్లెడ పడుతోంది. రాయలసీమలో సైతం రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్టీ ఫండ్ ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. ఈ తరుణంలో ఆర్థికంగా స్థితి మంతులైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు వైసిపి కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కీలక పార్లమెంటు స్థానాల నుంచి బరిలో దిగేందుకు సిట్టింగులు జంకుతున్నారు. కొంతమంది ముందుగానే పోటీ నుంచి తప్పుకుని.. తమ స్థానంలో ప్రత్యామ్నాయ నేతలను చూసుకోవాలని హై కమాండ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిని గమనించిన టిడిపి, జనసేన పార్టీ నాయకత్వాలు ఎంపీ అభ్యర్థులుగా బలమైన నేతలను బరిలో దించాలని చూస్తుండడం విశేషం. సాధారణంగా అధికార పార్టీ నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *