గవర్నర్ గిరీ కోసం నల్లారి…

సిరా న్యూస్,తిరుపతి;
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరిచయం అక్కరలేని పేరు. ఆయన అతి కొద్ది కాలమే ముఖ్యమంత్రిగా పనిచేసినా ఉభయ రాష్ట్రాల్లో ప్రజలందరికీ సుపరిచితమే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ వాదులకు విలన్ గా, ఆంధ్ర్రప్రదేశ్ వాసులకు హీరోగా నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు దశాబ్దకాలం తర్వాత రాజకీయ మనుగడ కోసం తంటాలు పడుతున్నారు. పార్టీలు మారినా ప్రయోజనం లేదు. రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీని పెట్టుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ ప్రజలకు కూడా ఆదరించలేదు. లాస్ట్ బాల్ సిక్స్ కొడతా అంటూ బీరాలు పలికిన నల్లారికి చివరకు రాజకీయంగా ఆశాభంగమే ఎదురయింది.. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ లో ఆయన ఇమడ లేకపోయారు. మొన్నటి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి మారారు. ఈసారైనా ఫేట్ మారుతుందని ఆయన గట్టిగా విశ్వసించారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. దీంతో రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఆయన బీజేపీ తరుపున బరిలోకి దిగారు. ఎంత మంది ప్రచారం చేసినా ఆయన గెలుపును సాధించలేకపోయారు. మళ్లీ రాజకీయాలకు దూరంగానే నిలిచిపోయారు. ఆయనకు ఎందుకో పాలిటిక్స్ కలసి రావడం లేదనిపిస్తుంది.. కానీ తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడంపై కూడా పెద్దయెత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏంటి? ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపైనే చర్చ జరిగి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఎందుకంటే ఒకనాడు బద్ధశత్రువులుగా, అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శించుకున్న ఈ నేతలిద్దరూ ఒక చోట చేరి మాట్లాడుకున్నారంటే అందులో పెద్ద మర్మమే ఉంటుంది. ఊరికే కలవరు మహానుభావులు అన్నట్లు వీరిద్దరి సమావేశం తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయిఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి తనకు ఇవ్వాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కోరినట్లు తెలిసింది. పదవి కోసం పదేళ్లుగా పరితపిస్తున్న నల్లారి చంద్రబాబుతో ఆఖరి ప్రయత్నం చేశారంటారు. బీజేపీ కోటాలో తనకు రాజ్యసభ పదవి ఇస్తే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెక్ పెట్టగలనని చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం బీజేపీకి కేటాయిస్తే మాత్రం నల్లారికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. మరొక ప్రచారం కూడా నడుస్తుంది. ఏపీ మంత్రి వర్గంలో ఒకరికి ఛాన్స్ ఉంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరికీ దక్కలేదు. దీంతో మంత్రివర్గంలో తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చోటు కల్పించాలని ఆయన కోరినట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *