పట్టించుకోని కొడుకు… గిఫ్ట్ డీడ్ రద్దు చేసిన కలెక్టర్

సిరా న్యూస్,కరీంనగర్;
: కడుపున పుట్టిన పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని.. తల్లిదండ్రులు చెమటోడ్చుతుంటారు. ఏ లోటు రాకుండా.. మంచి చదువులు చెప్పించి.. ప్రయోజకులను చేసేందుకు రక్తం దారపోస్తుంటారు. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ సంతానానికి కష్టమనేదే తెలియకుండా ఉండాలని.. ఎవరికీ చేయి చాచకుండా ఉండాలని.. కడుపు కట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టి ఆస్తులు కట్టబెడుతుంటారు. కడుపున పుట్టిన వారికి కోసం ఇన్ని చేస్తే.. చివరికి ఆ కన్నవారిని మిగిలేది.. వారి పిల్లల నుంచి ఈసడింపులు, వివక్షలే. ఆఖరి రోజుల్లో కనీసం వారిని అక్కున చేర్చుకుని.. నాలుగు ముద్దలు పెట్టి ఆకలి తీర్చేందుకు కూడా ఇష్టపడని రోజులు దాపురించాయి. అలాంటి ఓ కొడుకుకు.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎకరాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే.. జీవితంలో స్థిరపడిన ఆ కుమారుడు మాత్రం.. తనకు అన్నీ చేకూర్చిన తండ్రి బాగోగులు మాత్రం కొంతకాలంగా చూసుకోవట్లేదు. అయితే.. తన దగ్గరున్నది అమ్ముకునైనా చివరివరకు ఎవరి మీద ఆధారపడకుండా బతుకుదామనుకుంటే.. ఉన్నదంతా కొడుకుకే రాసిచ్చేయటంతో.. ఆ తండ్రికి వేరే దారి లేకుండా పోయింది. దీంతో.. తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు బాపురెడ్డి ఫిర్యాదు చేశాడు.దీంతో ఆ తండ్రి ఇచ్చిన విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొడుకు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి.. గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరు వర్గాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరిని పిలిచి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్ధారించారు.దీంతో.. వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్ణయించారు. అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10 వేలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామిరెడ్డితో పాటు కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత అందరు సంతానంపై ఉంటుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *