సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఆర్టీసీ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రూ. 400 కోట్లతో కొత్తగా 1050 డీజిల్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిలో 400 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. డీజిల్ బస్సులకు అదనంగా 1,040 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ పరిధిలో 540 సిటీ బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించింది ఆర్టీసీ యాజమాన్యం. 2024 మార్చి నాటికి ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 30న 80 కొత్త బస్సులను ప్రారంభించనుంది టీఎస్ఆర్టీసీ. కొత్త బస్సుల్లో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి స్కీమ్‌తో ప్రయాణికుల రద్దీ కూడా భారీగా పెరిగింది. మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. రద్దీ కారణంగా బస్సుల్లో సీట్లు దొరక్క మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కొత్తగా బస్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.