సిరా న్యూస్,పాట్నా;
దేశంలో రాజకీయ వాతావరణం మారినప్పుడుల్లా గోడదూకడం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అలవాటుగా మారిందని ఆర్జేడీ విమర్శించింది. ఇకపై అతడిని మళ్లీ అక్కున చేర్చుకునేది లేదని ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు నితీశ్‌కు అవకాశం కల్పించి మోసపోయామని మళ్లీ అతడు డ్రామాలు మొదలు పెట్టాడని.. ఈ సారి నమ్మేదే లేదని ఆర్జేడీ అధినేత తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత.. తేజస్వీ యాదవ్ స్పష్టమైన ప్రకటన చేశారు. బీజేపీతో అలయన్స్‌లో ఉన్నందుకు చేతులు జోడించి తమ పార్టీ ఎమ్మెల్యేల ఎదుట నితీశ్ క్షమాపణలు కోరారని.. అయినా ఆయన్ని విశ్వసించబోయేది లేదని చెప్పారు. ఈ కప్పదాట్ల వ్యవహారాలకు కాలం చెల్లిందని.. రెండు సార్లు మోసపోయిన తాము మరోసారి మహాకూటమిలోకి ఆయన్ని రానిచ్చేదే లేదని.. మహాఘట్ బంధన్ ద్వారాలు మరోసారి ఆయన కోసం తెరుచుకోబవని తేజస్వీ కుండబద్దలు కొట్టారు. నితీశ్ కుమార్ తేజస్వీతో భేటీ అయిన కాసేపటికే ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నితీశ్ చేసే ప్రమాణాలన్నీ నీటి మూటలనేనని.. అతడిపై ఎవరికీ నమ్మకం లేదని.. ఆయన ఎప్పుడైనా తన మనసు మార్చుకోగల ఊసరవెల్లి అని తేజస్వీ వ్యాఖ్యానించారు. రెండు సార్లు జాలిపడి రాజకీయంగా ప్రాణదానం చేస్తే ఆ వెంటనే తమకు వెన్నుపోటు పొడిచారని తేజస్వీ పేర్కొన్నారు. ఈ సారి మాత్రం అలాంటి తప్పు జరగబోదన్నారు. అర్జేడీని రూట్ లెవల్లో పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తేజస్వీ యాదవ్ ఆభార్ యాత్రను మంగళవారం ప్రారంభించారు. తొలిరోజును కార్యకర్త సందర్శన్- సంవాద్ పేరుతో కార్యకర్తల కష్టనష్టాలను విన్నారు. వారి నుంచి పార్టీ కోసం సలహాలు తీసుకున్నారు. భాజపా- జేడీయూ అలయన్స్‌లో నితీశ్ నేతృత్వంలో కొనసాగుతున్న సర్కార్‌కు బిహార్ ప్రజల రక్షణ గురించి అసలు పట్టడం లేదని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిని నేరాలు మితి మీరి పోయాయని తేజస్వీ ధ్వజమెత్తారు. 2025 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు.మొదటిసారి 2013లో ఎన్డీయే అలయన్స్ నుంచి బయటకు వచ్చిన నితీశ్ ఆ కూటమితో 17 బంధానికి తెరదించారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. వెంటనే వ్యూహం మార్చిన ఆయన.. ఒకప్పటి స్నేహితుడు, నాటికి ఆగర్భ శత్రువులా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు స్నేహహస్తం అందించారు. ఆ తర్వాత 2015లో ఆర్జేడీ తో అధికారం పంచుకున్న నితీశ్.. రెండేళ్లు తిరగక ముందే మహాఘట్‌బందన్‌కు రాంరాం చెప్పి మళ్లీ ఎన్డీయే తో కలిశారు. 2020 ఎన్నికల్లో మళ్లీ భాజపాతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న నితీశ్ మళ్లీ 2022లో భాజపాకు దూరం జరిగి ఆర్జేడీ తో జట్టు కట్టి మహాఘట్బంధన్కు జైకొట్టారు. మళ్లీ 2024 సార్వత్రిక సమరం సమయానికి ఎన్డీయే గూటికి చేరి కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగే సమయం దగ్గర పడుతుండడంతో ఆర్జేడీ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ సారి నితీశ్‌ను నమ్మేది లేదని ఆర్జేడీ అధినాయకత్వం తేల్చిచెప్పింది.