సిరా న్యూస్,తిరుపతి;
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన విషయాన్ని చంద్రబాబు బయటపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్‌లో సనాతన ధర్మ పరిరక్షణ రాజకీయాలు మేలుకున్నారు. డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వంద రోజుల పాటు ఆయన ఎక్కడా పెద్దగా ప్రసంగించలేదు. కనీ వంద రోజుల తర్వాత లడ్డూ ఇష్యూ తర్వాత ఆయనలోని పాత రాజకీయనాయకుడు కనిపించాడు. సెక్యూలరిజం పేరుతో హిందూత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్న వారికి.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతున్నట్లుగా సంకేతాలు పంపారు. వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై తమిళనాడులోనూ ఆయన ఓ ఇంటర్యూ ద్వారా పాపులర్ అయ్యారు. తమిళనాడులో పవన్ కల్యాణ్ అంత సుపరిచితుడు కాదు. ఆయన తెలుగులోనే సూపర్ స్టార్. తమిళవాసులకు పెద్దగా తెలియదు. మర తెలుగులో తమిళ హీరోలు ఎలా తెలుసో పవన్ కూడా అంతే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారికి కూడా బాగా చిరపరిచితం అయ్యాడు. తమిళనాడులో భావజాలాలు, సిద్ధాంతాల మధ్య పోరాటమే రాజకీయంగా ఉంటుంది. అలాంటి సమయంలో పవన్ ప్రారంభిచిన సనాతన ధర్మ రక్షణ హాట్ టాపిక్ అయింది. అందుకే ఓ పాపులర్ టీవీ చానల్ ఆయనను దాదాపుగా గంటన్నర పాటు ఇంటర్యూ చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ ప్రధానంగా తమిళ అంశాలు, హిందూత్వంపైనే మాట్లాడారు. తడబడకుండా తమిళ సంస్కృతిపై ఆయన చెప్పిన మాటలు.. అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నాయి. పవన్ కల్యాణ్ చెన్నైలోనే పెరిగారు. సోదరుడు చిరంజీవి హీరోగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చెన్నైలోనే గడిపారు. అందుకే ఆయనకు తమిళం అనర్గళంగా వచ్చు. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత చెన్నైతో అనుబంధం తగ్గిపోయింది కానీ.. భాషను మాత్రం ఆయన మర్చిపోలేదు. తమిళ టెక్నిషియన్లతో ఇప్పటికీ పని చేస్తూంటారు. తమిళంలో ఆయన ఇచ్చిన సమాధానాలు ప్రజల్ని ఫిదా చేశాయి. పవన్ కల్యాణ్ పై అక్కడి ప్రజల్లో ఇప్పటి వరకూ ఉన్న ఇమేజ్ ను పూర్తిగా మార్చేశాయన్న అభిప్రాయాలను తమిళనాడు వాసులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది హిందూత్వ ఫేస్ గా పవన్ కల్యాణ్ ఎదుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందకే వారాహి డిక్లరేషన్ ను ఆయన ప్రకటించబోతున్నారు. అందులో ఖచ్చితంగా మరింత ఎక్కువగా సనాతన ధర్మం కోసం తాను చేయబోయే కార్యక్రమాల్ని ప్రకటించే అవకాశం ఉంది. పవన్ రాజకీయం కోసం ఈ సనాతన ధర్మ రక్షణ పోరాటం చేయకపోవచ్చు కానీ.. ఆ పోరాటం చుట్టూ రాజకీయం అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులోనూ ఆయన ఇప్పుుడు వైరల్ గా మారారు. వచ్చే కొద్ది రోజుల్లో ఆయన కర్ణాటక,కేరళల్లోనూ పర్యటించినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా పవన్ రాజకీయం మాత్రం వ్యూహాత్కకంగా సాగుతోందని అనుకోవచ్చు.