సిరా న్యూస్,విశాఖపట్టణం;
విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.మరోవైపు రుషికొండ భవనాలను ఏపీ రాష్ట్ర మ్యూజియంగా మార్చాలంటోంది..బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటక్షన్ కమిటీ. ఉత్తరాంధ్రలో లభించిన బౌద్ధ అవశేషాలను భవనాల్లో ప్రదర్శనకు ఉంచాలని చెబుతోంది. జాతీయ-అంతర్జాతీయ సెమినార్ల కోసం పరిశోధకులకు కావలసిన సాంకేతిక సౌకర్యాలు కల్పించేలా భవవాలను వాడుకోవాలని ప్రభుత్వానికి ఆ సంస్థ సూచిస్తోంది.గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం రుషికొండలో భవనాలను నిర్మించినట్టు ప్రచారం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం ఓటమిపాలవడంతో.. ఇప్పుడు వాటిని కూటమి సర్కార్ ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రుషికొండలో భవనాలను చూసి ఆశ్చర్యపోతున్న చంద్రబాబు.. అమరావతిలో అలాంటి భవనాలు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నిస్తోంది..వైసీపీ. రుషికొండలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది.నిర్వహణపరంగా చూస్తే రుషికొండ భవనాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఈ భవనాలను ఏం చేయాలి? ఏ విధంగా ఉపయోగించాలి? అనే విషయాలపై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టిపెట్టింది. మరోవైపు భవనంపై వివిధ సంఘాలు పలు సూచనలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. మరి దీనిపై కూటమి సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి
6 నెలల నుంచి నిరుపయోగం
ఈ ప్యాలెస్‌ల కంటే ముందు.. ఈ రిషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేది. ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతున్న రిసార్ట్స్‌ని కూల్చేసి.. కొండను తొలిచి.. 22 ఎకరాలను చదును చేసి.. ఈ భారీ నిర్మాణాలను చేపట్టారు. ఈ ప్యాలెస్ కోసం టూరిజం శాఖకు చెందిన కాటేజీలను కూల్చడమే కాదు.. దీనికి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని వాదనలు ఉన్నాయి. నాలుగున్నర ఎకరాల్లో భారీ భవనాలు నిర్మించారు. ఐదు ఎకరాల్లో వందలాది మొక్కలతో.. ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. ఈ నిర్మాణాలు జరుగుతున్న సమయంలో.. సెవెన్ స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, కాటేజీలు నిర్మిస్తున్నామని మభ్య పెట్టారు. కానీ.. ఐదు బ్లాకుల్లో బెడ్ రూంలు, డైనింగ్, లివింగ్ రూమ్స్, మీటింగ్ హాల్స్ నిర్మించారు. రాజభవనంలా.. విశాలంగా, విలాసవంతంగా ఈ ప్యాలెస్‌లను తీర్చిదిద్దారు. మాయాబజార్ సినిమాలోని మయసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్, ఫన్నీచర్‌తో నింపేశారు. పైగా.. ప్రతి నెలా లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ఖర్చవుతుండటం.. అదనపు భారంగా మారింది. ఇప్పటివరకు ఒక్క విద్యుత్ శాఖకే.. 85 లక్షల కరెంటు బిల్లులు చెల్లించారట. దీనికితోడు.. గార్డెన్ మెయింటెనెన్స్, ఈ ప్యాలెస్‌కు సెక్యూరిటీ, రోజూ పనిచేసే సిబ్బందికి జీతాలు.. ఇలా నెలకు లక్షల్లో చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు. ప్రజా కోర్టులో రుషికొండలో జరిగిన నేరంపై చర్చ జరగాలన్నారు. ఇక్కడ విలాసవంతమైన భవనాలు చూసి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. పర్యాటక శాఖకు కూడా రుషికొండ కాస్ట్లీ ఎఫైర్ అయ్యిందన్నారు. రుషికొండ కోసం ప్రజాస్వామ్యం భారీ మూల్యం చెల్లించిందన్నారు. రుషికొండ చర్చ అవసరం లేదు శిక్ష మిగిలిందన్నారు.ఈ వ్యవహారంలోనే సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసిన వైసీపీ నేతలు తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్ మార్చేశారు. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ భవనాల వ్యవహారంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు ప్రజలను సైతం అయోమయనికి గురి చేస్తున్నాయి. రుషికొండలో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనాలు చూసి చంద్రబాబు ఆశ్చర్య పోతున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఇలాంటి భవనాలు అమరావతిలో తామెందుకు కట్టలేకపోయామో అని చంద్రబాబు ఆలోచించాలని అన్నారు అంబటి.రిషికొండ ప్యాలెస్‌కు సంబంధించి కూటమి నేతలు.. ప్రజాధనాన్ని వృధా చేశారని.. ఆ భావనలను సొంత అవసరాల కోసం మాజీ సీఎం నిర్మించారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారని చెబుతున్నారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమంటున్నారు. ఇరు వర్గాల వైఖరి ఎలా ఉన్నప్పటికీ భారీ మొత్తంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండడం పట్ల ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు.