కరీంనగర్ ఎంపీపై గులాబీ గురి

సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ లోక్‌సభ స్థానంపై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కరీంనగర్‌లో పార్టీ వీక్ కావడం కూడా రాష్ట్రంలో ఓటమికి బలమైన కారణమన్న ఆలోచనలో ఆ పార్టీ ముఖ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుండే పావులు కదపాలని భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణాపై స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది.
కరీంనగర్ లోకసభ స్థానం నుండి గెలువాలన్న లక్ష్యంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ పావులు కదపడం ఆరంభించారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు సీక్రెట్ ఆపరేషన్లు కూడా చేపట్టారు. కరీంనగర్ లోకసభ పరిధిలోని సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలువగా, మిగిలిన నాలుగు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి నుండి ఆ సమస్యను అధిగమించేందుకు అవసరమైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు వినోద్ కుమార్.అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలను సవరించుకుంటూ ఆయా నియోజకవర్గాల ఇంఛార్జీలతో కూడా సమీకరణాలు నెరిపే పనిలో పడ్డారు. రెండు మూడు నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నందున పట్టు నిలుపుకోవాలన్న సంకల్పంతో వినోద్ కుమార్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే పనిలో పడ్డారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ మానియా… ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ప్రభావం ఎంపీ ఎన్నికలపై తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని గమనించిన ఆయన ఇప్పటి నుండే కార్యరంగంలోకి దిగి తనకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నారు.అయితే ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో విజయం సాధించడం ఖాయం అనుకున్నప్పటికీ, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిరుత్సాహ పరిచింది. ఈ నైరాశ్యం ముఖ్య నాయకుల నుండి మొదలు సామాన్య కార్యకర్తలోనూ కనిపిస్తుండడంతో వారిలో మానసిక ధృడత్వాన్ని నింపాలన్న యోచనతో వినోద్ కుమార్ సాగుతున్నారు. ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న దిగులును దూరం చేయడం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో చప్పబడిపోతే, దీని ప్రభావం లోకసభతో పాటు స్థానిక సంస్థల్లోనూ పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కేడర్‌ను తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *