పాపం..ఎరక్కపోయి వచ్చి..ఇరుక్కుపోయింది…

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ ప్రియుడిపై పగ తీర్చుకోవడం కోసం ఓ యువతి సినిమా రేంజ్ పథకం పన్నింది. అది అమలు చేసి ప్రియుడ్నే బుక్ చేయాలని కుట్ర చేసింది. చివరికి తాను తీసిన గొయ్యిలో తానే పడి కటకటాల వెనక్కి వెళ్లింది. ప్రియుడికి చెందిన కారులో గంజాయి పెట్టించి లా స్టూడెంట్ అయిన ఓ యువతి అతణ్ని పోలీసులకు పట్టించింది. పోలీసులు కూడా అతణ్ని అరెస్టు చేసి.. విచారణ చేయగా అసలు గుట్టు బయటపడింది. పోలీసుల విచారణలో ప్రియురాలి నిర్వాకం వెల్లడైంది. దీంతో యువతితో సహా ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. మొత్తం 40 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. రహమత్‌ నగర్‌లో నిందితురాలు రింకీ నివాసం ఉంటోంది. ఆమె అమీర్‌ పేటలోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తోంది. రింకీతోపాటే సరూర్‌ నగర్‌కు చెందిన శ్రవణ్‌ అనే వ్యక్తి కూడా అదే ఏరియాలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక.. శ్రవణ్‌ ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో రింకీ తన ప్రియుడిపై కక్ష పెంచుకుంది. అతడిని ఎలాగైనా ఇబ్బందుల్లోకి నెట్టాలని పథకం పన్నింది. ఇందుకోసం జైలుకు పంపాలని ప్లాన్ వేసింది.ఆమె వేసిన ప్లాన్ లో భాగంగా తన స్నేహితుల సాయం తీసుకుంది. గంజాయి ఎక్కడ దొరుకుతుందో వివరాలు తెలుసుకొని వారి నుంచి.. మంగళ్‌హాట్‌లో రూ.4 వేలకు 40 గ్రాముల గంజాయిని కొన్నది. ఆ గంజాయిని చిల్లరగా అమ్ముతున్నట్లుగా ఒక్కో ప్యాకెట్ 8 గ్రాముల చొప్పున 5 ప్యాకెట్లు తయారు చేసింది. వాటిని తన వద్ద ఉంచుకుంది. తన స్నేహితులతో శ్రవణ్‌కు ఫోన్‌ చేయించి.. అమీర్‌ దగ్గర్లోని ఓ చోటకు మాజీ ప్రియుణ్ని రప్పించింది. ఆ తర్వాత రింకీ, ఆమె ఫ్రెండ్స్, శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్‌లో ఉన్న టైంలో రింకీ పక్కకు వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది. శ్రవణ్‌ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని.. ఫలానా చోట అతని కారు ఉందని చెప్పింది. ఆ నెంబరు కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు వద్దకు వచ్చి శ్రవణ్ ను పిలిపించి చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వెంటనే శ్రవణ్‌ను అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నించారు. ఆ కారు తనది కాదు, తాను వేరే వాళ్ల కారులో వచ్చానని శ్రవణ్ చెప్పాడు. అతను చెప్పిన కోణంలోనే పోలీసులు విచారణ చేసి.. ఆ కారులో వచ్చిన వారందరినీ తమదైన శైలిలో విచారణ చేస్తే అసలు విషయం బయటికి వచ్చింది. రింకీ తన మాజీ ప్రియుడిపై పగ తీర్చుకోవడం కోసం ఇదంతా చేసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రింకీతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురు ఫ్రెండ్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *