హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్

 సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమయ్యారు. అయితే తన ఇలాఖాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. హైదరాబాద్ బస్తీలో ఊహించని రచ్చ జరిగింది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లిస్‌ ఇలాఖాలో పర్యటించడంతో.. లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఫైర్ అయ్యారు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్‌ చోటు చేసుకుంది.కాంగ్రెస్, ఎంఐఎం మధ్య బలప్రదర్శనకు తెరలేచింది.నాంపల్లిలోని బ్యాంకు కాలనీలోని సిసిరోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ ఖాన్‌ రావడం గొడవకు కారణమైంది. ఫిరోజ్ ఖాన్ వచ్చారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.. తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఫిరోజ్ ఖాన్‌తో పాటు అతని అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఇరువురు నేతల అనుచరులు పరస్పరం దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌ కొందరు రౌడీషీటర్లు, క్రిమినల్స్‌ను వెంటపెట్టుకుని ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ఆయన నాంపల్లిలో పర్యటిస్తే అభ్యంతరం లేదని.. అయితే ఈ రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాజిద్ హుస్సేన్, ఎంఐఎం ఎమ్మెల్యే .అయితే ఇటు కాంగ్రెస్, అటు ఎంఐఎం బలప్రదర్శనకు దిగడమే ఈ మొత్తం గొడవకు కారణమనే టాక్ వినిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. నాంపల్లిలో తనకున్న పట్టును మరింత పెంచుకోవాలని ఫిరోజ్ ఖాన్ భావిస్తుంటే.. ఆయనను అడ్డుకోవాలని ఎంఐఎం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్‌కు తెరలేచిందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పంచాయితీకి ఇంతటితో ఫుల్‌ స్టాప్‌ పడుతుందా లేక రాబోయే రోజుల్లో ఇటు ఫిరోజ్ ఖాన్, అటు మజ్లిస్ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఇదే రకంగా కొనసాగుతుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *