ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అమలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో ఎత్తు. ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే నిబంధనల్లో కాస్త సడలింపులు ఇస్తోంది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయిన పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే మొదటి విడతకు మాత్రమే ఇది పరిమితం అవుతుందని తెలిపారు మంత్రి. ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ సర్వే పూర్తి అయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి అందరికీ రేషన్ కార్డులు లేనందున ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో దీన్ని చేర్చడం లేదన్నారు. తర్వాత విడుత నుంచి మాత్రం రేషన్ కార్డు కంపల్సరీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఎప్పుడే ప్రారంభించిన ప్రభుత్వం తొలి విడతలో ఇంటి స్థలం ఉండి గృహాలు లేని వారిపై ఫోకస్ పెట్టింది. వీళ్లకు ఇళ్లు కట్టించే ఇచ్చే బాధ్యత భుజాన వేసుకుంది. రెండో విడతలో స్థలం కూడా లేని వారికి ఇళ్లు కట్టించి ఇస్తారు. నవంబర్ ఆరు నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. దీని కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఒకసారి సమాచారం సేకరించిన తర్వాత దాని ఆధారంగా గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులను నిర్ణయిస్తారు. నవంబర్ 15వ తేదీ నుంచి 20 మధ్య ఈ గ్రామసభలు జరగనున్నాయి. గ్రామస్థలు సమక్షంలో అర్హులు ఖరారైన తర్వాత వారికి స్థలం కేటాయిస్తారు. కేంద్రం చెప్పిన నిబంధనల ప్రకారం 80 గంజాల వరకు స్థలం ఇస్తారు. ఆయా గ్రామాల్లో స్థలం అందుబాటులో ఉంటే సరేసరి లేకుంటే కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పర్యవేక్షణకు అధికారులను ప్రభుత్వం నియమించనుంది. ఈ నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, రాయితీపై మిగతా నిర్మాణ సామగ్రి సప్లై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నియోజకవర్గానికి తొలి దశలో 3,500 ఇళ్లు కేటాయించి అవి నిర్మాణాల పూర్తి అయిన తర్వాత రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇలా ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.