నల్ల బ్యాడ్జీలతో ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిరసన

నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహానికి వినతి
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
ఆర్థిక భారంతో విద్యార్థులకు విద్యను అందించలేక పోతున్నామని, ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో విద్యాసంస్థలను నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పేర్కొంది. జిల్లా కేంద్రంలోని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని దీంతో విద్యాసంస్థలను నడపడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పడగకు ముందు విడతల వారీగానైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు స్పందించలేదని, గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రావడం లేదన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం విద్యాసంస్థలను స్థాపిస్తే ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నయని వారు ఆరోపించారు. ఆర్థికంగా ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *