సిరా న్యూస్, ఆదిలాబాద్
విశ్వ కర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* ఐదు శాతం తక్కువ వడ్డీకి రుణం
* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్
ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించిన పిఎం విశ్వ కర్మ యోజన పథకం పై పంచాయితీ కార్యదర్శులు, ఎంపీఓ లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం విశ్వ కర్మ యోజన పథకం పై విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పథకం ముఖ్యంగా కులవృత్తి చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకం కింద కేవలం 5 శాతం తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చని, సబ్సిడీ సైతం ఉంటుందని, వివిధ వృత్తులు చేసుకునే వారికి శిక్షణ ఇవ్వడం ,మార్కెటింగ్ తో పాటు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. పిఎం విశ్వ కర్మ యోజన పథకం క్రింద వడ్రంగులు, కమ్మరులు, గంపలు, చాపలు, చీపురులు వంటి వివిధ పరికరాల తయారీదారులు, బంగారం పని చేసే వారు, కుమ్మరులు, శిల్పులు, చర్మకారులు, పాదరక్షల తయారీ దారులు, తాపీ పనివారు, క్షురకులు (నాయీ వృత్తిదారులు), రజకులు, దర్జీలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, రేషన్ కార్డు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సీఎస్‌సీసెంటర్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలో లక్ష రూపాయలు ఋణం మంజూరు చేయడం జరుగుతుందని, నిర్ణిత సమయంలో చెల్లించిన వారికీ తిరిగి 2 లక్షల ఋణం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పంచాయితీ కార్యదర్శులు, ఎంపీఓ లు గ్రామాల్లో విస్తృత అవగహన కల్పించాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, జిల్లా పంచాయితీ అధికారిణి శ్రీలత, ఎల్‌డీఎం భాస్కర్, ఎంఎస్ ఎంఈ డైరెక్టర్ రాజేష్ కుమార్, మెప్మా డీఎంసీ శ్రీనివాస్, సీఎస్‌సీ మేనేజర్ రాహల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.