బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరా న్యూస్,హైద‌రాబాద్;
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సోద‌రుడు తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేశాం. ఏక‌ప‌క్షంగా ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. అందుకే హైద‌రాబాద్‌లో ఉంటున్న పేద ప్ర‌జ‌ల‌పై సీఎం ప‌గ‌బ‌ట్టిండు. హైద‌రాబాద్‌లో ఉండే గ‌రీబోళ్లు.. ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్తీల్లో ఉండే పేదోళ్ల వెంట ప‌డ్డాడు. సీఎంకు చిత్త‌శుద్ధి, నిజాయితీ ఉంటే త‌న అన్న‌తో పాటు పేదోళ్ల‌ను కూడా స‌మానంగా చూడాలి. వాళ్ల అన్న‌కు ఒక న్యాయం ఉంటది.. గ‌ల్లీల ఉండే గ‌రీబోళ్ల‌కు ఒక న్యాయం ఉంట‌దా..? దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప‌రిధిలో తిరుప‌తి రెడ్డి ఇల్లు ఉంట‌ది. తిరుప‌తి రెడ్డికి నోటీసులు ఇచ్చి.. కోర్టుకు పోయి కాగితం తెచ్చుకో నిన్ను ముట్ట అని చెప్తాడు. అదే గ‌రీబోడి ఇంటికి తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కు బుల్డోజ‌ర్లు వ‌స్తాయి. పుస్త‌కాలు తీసుకుంటాం అంటే ద‌య ఉండ‌దు. బియ్యం తీసుకుంటాం అంటే ద‌య ఉండ‌దు. చెప్పుల దుకాణంతో బ‌తికేవారిని రోడ్డున ప‌డేస్తారు. బిల్డింగ్‌లు నిర్దాక్షిణ్యంగా కూల‌గొడుతారు. తిరుప‌తి రెడ్డికి ఒక న్యాయం.. పేదోళ్ల‌కు ఒక న్యాయ‌మా..? కోర్టులు ప‌ని చేయ‌ని శ‌ని, ఆదివారాల్లో వ‌చ్చి కూల‌గొడుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.మ‌నం ప‌దేండ్ల‌లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తే.. రేవంత్ రెడ్డి డిస్ట్ర‌క్ష‌న్ చేస్తుండు. ఒక్క శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 12 వేల కోట్ల రూపాయాలు పెట్టి ఫ్లై ఓవ‌ర్లు, లింక్ రోడ్లు, అండ‌ర్ పాస్‌ల‌తో పాటు ఎస్టీపీలు క‌ట్టాం. మ‌నం మంచి ప‌నులు చేసుకుంటూ పోయాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక 9 నెల‌ల కాలంలో ఒక్క మంచి ప‌ని చేయ‌లేదు. రియ‌ల్ ఎస్టేట్ దందా త‌ప్ప ఒక్క‌టి మంచి ప‌ని చేయ‌లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *