సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల ద్వారా పేదలక ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేదలు వాటిని తినకుండా అమ్మేస్తున్నారు. దీంతో అవి చివరకు రైస్ మిల్లులు లేదా మహారాష్ట్రకు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల రీసైక్లింగ్ దందాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి నుంచి దీనిని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాజాగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు సన్న బియ్యం పంపిణీపై స్పష్టత ఇచ్చారు. జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న అందరికీ ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని తెలిపారు. త్వరలో జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.రేషన్ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తున్నారు. గతంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రేషన్ కార్డుపై పేదలకు సబ్సిడీ ధరకు చక్కెర, బియ్యం, గోధుమలతోపాటు 9 రకాల సరుకులు పంపిణీ చేసేవారు. తాజాగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పేదల కోసం బియ్యంతోపాటు మరికొన్ని సరుకులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. రేషన్ కార్డు పేదలకు మాత్రమే ఉంటుందని, రేషన్ కార్డుకు, ప్రభుత్వ పథకాలకు సంబంధం ఉండదని తెలిపారు, ఆరోగ్యశ్రీతో కూడారేషన్ కార్డుకు సంబంధం లేదని తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్డుల ఆధారంగానే అర్హులను గుర్తిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్నవారే పథకాలకు అర్హులనే అపోహలు వీడేలా డిజిటల్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్డులో ఫ్యామిలీ పూర్తి సమాచారం ఉంటుందని పేర్కొన్నారు.