సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 43.1 అడుగులకు చేరటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా వస్తున్నందు వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. భద్రాచలం తో పాటు గోదావరి పరిసర ప్రాంతాల లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. జాలారులు పడవలు నడిపేవారు ప్రయాణికులు గోదావరి పరివాహక ప్రాంతాలకు వాగులు, వంకల వద్దకు వెళ్ళవద్దని సూచించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇంకా నీటిమట్టం పెరిగితే పలు రహదారులకు వరద నీరు చేరే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువన విడుదల చేసిన వరద నీటి తో భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి నెలకొంది అని అధికారులు భావిస్తున్నారు.