సిరా న్యూస్,విశాఖపట్టణం;
జిల్ జిగేల్మంటూ శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు.. పెద్ద పెద్ద ప్రవేశ ద్వారాలు.. విశాలమైన బెడ్రూమ్స్, అందుకు ఏ మాత్రం తీసిపోని స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్‌లు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం.ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మించిన ఆ కట్టడం ఓ రాజభవనం. ఏ వైట్‌హౌస్ లోపలికో, బకింగ్‌హాం ప్యాలెస్‌లోకో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అవే రుషికొండ సౌధం. గత వైసీపీ హయాంలో భీమిలి బీచ్ రోడ్డులో సముద్రాన్ని ఆనుకుని రుషికొండపై కట్టిన భవంతుల చుట్టూ ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది.రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని ఇప్పుడేం చేస్తారన్న చర్చ మొదలైంది. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులు వచ్చినప్పుడు అతిథి గృహాలుగా వాడేందుకు కట్టామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అంత వివాదం అయినా అప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది.వైఎస్ జగన్ ఉండటం కోసమే రుషికొండ ప్యాలెస్‌ను కట్టారని ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు రుషికొండ భవనాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూటమి సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ అవసరాలకే వాడుకుందామా లేక ప్రైవేటుకు ఇద్దామా అనేదానిపై ఇంటర్నల్‌గా చర్చలు జరుపుతోంది పర్యాటకశాఖపై సీఎం చంద్రబాబు పలుసార్లు రివ్యూలు చేసినా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. మంత్రులు దుర్గేశ్, లోకేశ్ విశాఖలో పర్యటించినా రుషికొండ భవనాన్ని సందర్శించలేదు. పర్యాటక శాఖ మంత్రి అయితే అది మ్యూజియంగా తప్ప దేనికి పనికిరాదంటున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.అయితే ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెలా లక్షల్లో ఖర్చవుతోంది. నిర్వహణ సామర్థ్యం, నైపుణ్యం ఉన్న సిబ్బంది లేరు. వీటిని రిసార్టులుగా మార్చాలన్నా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ భారం ఎక్కువవుతుందని భావిస్తున్నారు. అందుకే రుషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోందిరుషికొండపై 9.88 ఎకరాల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కట్టిన ఈ భవనాల నిర్వహణకే ప్రతిరోజు లక్ష వరకు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ భవనాలను పూర్తిస్థాయిలో వాడటం మొదలుపెడితే 100 మంది వరకు సిబ్బంది అవసరమని చెప్తున్నారు. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుందని.. ఇప్పటికే కొన్ని వస్తువులు పాడైనట్లు చెబుతున్నారు.ఇక రుషికొండ భవనాలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఐదు నెలల్లో ప్రతి నెలా సగటున 6 లక్షలపైనే బిల్లు వచ్చింది. ఇప్పటివరకు 85 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతినెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. అదే వినియోగంలోకి వస్తే ఇది రెండింతలు అవుతుందని అంచనా.భవనాల దగ్గర 10వేల 4 చదరపు మీటర్లలో 58 రకాల మొక్కలు నాటారు. వీటిలో చాలావరకు విదేశాల నుంచి తెచ్చినవే. వాటి నిర్వహణ సరిగ్గా లేక చాలా మొక్కలు ఎండిపోయాయి. అయితే విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.