సిరాన్యూస్, బేల:
పెండింగ్ బిల్లులపై మంత్రిని కలిసిన సర్పంచులు..
-నిధులు విడుదల చెయ్యాలని వినతిపత్రం
గడిచిన పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు పాలయ్యామని, తమకు డబ్బులు చెల్లించేలా చూడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలానికి చెందిన పలువురు సర్పంచులు కలిసి విన్నవించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ… ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని అనేక గ్రామపంచాయతిల్లో చేపట్టిన పనులకు సంబంధించిn బిల్లులు రాక సర్పంచులు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చుకొని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములైన తమకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా మోసం చేసిందని అన్నారు. ప్రస్తుతం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గత ప్రభుత్వం 10 నుంచి 15 లక్షల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో, నేటికీ అప్పుగా తెచ్చిన డబ్బులకు వడ్డీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేసి, ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోవర్ గ్రామ సర్పంచ్ ఆడే శంకర్, చాంపెల్లి సర్పంచ్ జంగుశవ్, ఎకోరి సర్పంచ్ సీతారాం, నాయకులు సంతోష్ తదితరులు ఉన్నారు.