సిరా న్యూస్,ఏలూరు;
లేడీస్ హాస్టల్ ముసుగులో ఓ కామాంధుడు బాలికల పై లైంగిక దాడులకు దిగాడు. ఫొటోషూట్లంటూ ఆశ చూపి, మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. బాధితుల్లో ముగ్గురు ఏలూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఏలూరులో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉండేది. సుమారు 50 మంది ఇక్కడ వసతి పొందుతూ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. కరోనా సమయంలోఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో ఏలూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ శశికుమార్ హస్టల్ నిర్వహణను చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఏలూరు జడ్పీ సెంటర్ లో ఫొటో స్టూడియో సైతం నడుపుతున్నాడు. ఏలూరులో వసతిగృహం వార్డెన్ గా తన రెండో భార్యను, సంరక్షకురాలిగా మేనకోడలిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి పాల్పడేవాడని, తమను కొట్టేవాడని పోలీసులకి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఫొటోషూట్ అంటూ ఈనెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న వసతిగృహంలో దింపాడని వాపోయారు.