ఆరు పోస్టులు… పదుల సంఖ్యలో ఆశావహులు

సిరా న్యూస్,రంగారెడ్డి;
తెలంగాణ‌లో క్యాబినెట్‌ విస్తర‌ణ‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి.. 9 నెల‌లు గ‌డిచిపోవడంతో మలి దశ విస్తరణపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి పెట్టారని అంటున్నారు. వరద నష్టంపై కేంద్ర సాయం కోరుతూ ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పనిలో పనిగా…. మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం అనుమతి తీసుకుంటారని చెబుతున్నారు.మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి జోడు ప‌ద‌వుల‌లో కొన‌సాగారు. పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ కుమార్ గౌడ్‌ను నియ‌మించ‌డంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యారు. ఇక సాధ్యమైనంత తొంద‌ర‌గా మంత్రివర్గ విస్తర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు క్యాబినెట్‌ విస్తరణకు పీసీసీ చీఫ్‌ నియామకమే అడ్డుగా ఉండేది. సామాజిక సమీకరణల దృష్ట్యా ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే తర్జనభర్జన కొనసాగింది. ఇప్పుడు పీసీసీ పీఠముడి వీడిపోవడంతో మంత్రి వర్గ కూర్పు ప్రభుత్వానికి సవాల్‌గా మారిందంటున్నారు.ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో క‌లుపుకుని 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరు ఖాళీలు ఉండగా, ఆశావహులు భారీ క్యూలో ఉన్నారు. ఎలాగైనా మంత్రి పదవి కైవసం చేసుకుని బుగ్గ కారులో తిరిగేయాలని త‌హ‌త‌హలాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దల ఆశీస్సుల కోసం హైదరాబాద్‌, ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. కులం, బలం, ప్రాంతం వంటి లెక్కలన్నీ వివరిస్తూ తమ అర్హతలను పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నారు. దీంతో ఆశావహుల్లో వడపోతకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైద‌రాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. ఈ విస్తర‌ణ‌లో ఆయా జిల్లాలకు కేబినెట్ ప్రాతినిధ్యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు సీఎం. దీంతోపాటు ఆరు బెర్తుల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవ‌కాశమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేబినెట్ రేస్‌లో రంగారెడ్డి జిల్లా నుంచి మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహ‌న్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోద‌రులు, ఎడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగ‌ర్ రావు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక నిజామాబాద్ నుంచి సుద‌ర్శన్‌రెడ్డికి దాదాపు బెర్త్ క‌న్ఫామ్ అయ్యింద‌న్నది టాక్. న‌ల్గొండ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, బాలు నాయ‌క్ పోటీ పడుతుండగా.. హైద‌రాబాద్ నుంచి దానం నాగేంద‌ర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరిలో ఎవ‌రికి హైక‌మాండ్ క‌టాక్షం ద‌క్కుతుందన్న చ‌ర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *