సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన- బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసివచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కల్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకరం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన ఎక్కడ పోటీచేయాలో తమకు స్పష్టత ఉందని.. సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనున్నట్లు సంకేతాలు పంపారు. మరోవైపు జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారు. తమ వెంట బిజెపి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ బిజెపి నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అయితే బిజెపిని ఒప్పించే పనిలో పవన్ పడినట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పవన్ బిజెపి అగ్రనేతలతో చర్చలు జరుపుతారని సమాచారం.పొత్తుకు బిజెపి రాష్ట్ర నాయకులు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారు హై కమాండ్ పెద్దలపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూటమితో ముందుకు వెళితే సీట్లు, ఓట్లు పెంచుకోవచ్చని.. జాతీయ రాజకీయాల్లో మార్పుల దృష్ట్యా పొత్తు కీలకమని ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిపాదన వచ్చిందని.. కానీ సీట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుకు బిజెపి హై కమాండ్ నుంచి సానుకూలత వచ్చిందని.. సంక్రాంతి లోగా సీట్ల సర్దుబాటు విషయమై తేల్చేయాలని బిజెపి పెద్దలు ఒక కృత నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీయే ఈ విషయంలో నాన్చుడు ధోరణి తో ఉందని తెలుస్తుండడం విశేషంఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు టిడిపి మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని జనసేన నాయకులు ఖండిస్తున్నారు. 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు జనసేన డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా బిజెపి ఆరు లోక్ సభ సీట్లు, 12 అసెంబ్లీ సీట్లు కావాలని అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే జనసేనకు అసెంబ్లీ స్థానాలు పెద్ద ఎత్తున సర్దుబాటు చేయాల్సి ఉండడంతో.. బిజెపి పరంగా అసెంబ్లీ సీట్లు తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అవసరమైతే లోక్ సభ స్థానాలు విషయంలో బెట్టు వీడుతామని.. కానీ అసెంబ్లీ స్థానాలు విషయంలో టిడిపికి విడిచి పెట్టాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పొత్తులపై ఫుల్ క్లారిటీ తేవాలని పవన్ భావిస్తున్నారు. అందుకే జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్తున్నారు. అగ్రనేతలతో కీలక చర్చలు జరపనున్నారు.