సిరా న్యూస్;
-నేడు ఆయన వర్ధంతి
కనురెప్ప మరల్చలేని అందం శోభన్ బాబు సొంతం. ఎన్నో మరిచిపోలేని పాత్రలకు జీవం పోసి, తెలుగు వారి గుండెల్లో మహారాజుగా వెలుగొందింది ఆయన రూపం. ఇద్దరు భార్యల మధ్యలో నలిగిపోయే పాత్రలో నటించి మహిళా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సోగ్గాడు ఆయన. ప్రేమకథలకు రొమాంటిక్ హీరోగా, మాస్, క్లాసికల్ పాత్రలకు నిర్వచనంగా నిలిచారు శోభన్ బాబు. ట్రాయాంగిల్ లవ్ స్టోరీలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అరుదైన హీరో శోభన్ బాబు. నేడు ఆ అందాల సోగ్గాడి జయంతి. జనవరి14,1937లో కృష్ణా జిల్లా చిన నందిగామలో పుట్టిన శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు. సామాన్య రైతుల కుటుంబంలో జన్మించిన ఈయన హైస్కూల్లో చదివిన రోజుల్లోనే నాటకాలపై ఆసక్తిని పెంచుకున్నారు. మద్రాసు లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవారు.. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు.1959లో శోభన్ బాబు తన మొదటి సినిమా.. ‘దైవబలం’ చేశారు. ఎన్టీయార్ తో కలిసి చేసిన ఈ సినిమా విజయవంతం కాలేదు. దాని తర్వాత నెక్ట్స్ ఏడాదే భక్త శబరి చిత్రంలో మునికుమారుడుగా నటించారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో .. సినీ పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శోభన్ బాబు. తర్వాత వచ్చిన చిన్న చిన్న అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకుంటూ తెలుగు టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. నర్తనశాల, వీరాభిమన్యు, బంగారు పంజరం, మనుషులు మారాలి, దేవాలయం, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు సినిమాలు శోభన్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం సినిమాలతో శోభన్ బాబు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడుగా మారిపోయారు.హీరోగానే కెరీర్ ముగించిన శోభన్ బాబునటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు బిరుదులను సొంతం చేసుకున్న శోభన్ బాబు సినీ ఫీల్డ్ లోనూ వెరీ హంబుల్ మ్యాన్ అనే పేరును తెచ్చుకున్నారు. ఎప్పడూ ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా….అందరితోనూ కలిసిపోయే ఆయన సినిమాలకు దూరం అయిన తర్వాత మాత్రం ఎవరికీ కనిపించకుండా… కుటుంబానికే పరిమితమయ్యారు. హీరోగానే తన కెరీర్ ముగించారు. సహాయక పాత్రల జోలికి పోలేదు. సినీ జీవితానికి స్వస్తి చెప్పిన తర్వాత శోభన్ బాబు శేష జీవితాన్ని అందరికీ దూరంగా మద్రాసులో తన సొంత ఇంటిలోనే గడిపారు. మార్చి 20, 2008న కన్నుమూశారు. శోభన్ బాబు మనిషిగా మరణించినా.. నటుడిగా.. ఉత్తమ వ్యక్తిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సోగ్గాడిగానే నిలిచి ఉన్నారు.