సిరాన్యూస్, శంకరపట్నం:
తాడికల్ లో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం, జాతర కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ మహిళలు నైవేద్యం వండుకుని బోనంకుండా నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య, అమ్మవారి ఆలయానికి చేరుకుని తీర్థప్రసాదాలు, నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కళ్యాణ, జాతరను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని ఇది అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయమని తెలియజేశారు. అనంతరం పంబాల కులస్తులు శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని ల యొక్క జీవిత చరిత్రను ఆటపాటలతో అలరిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. గౌడ సంఘం ఆలయ కమిటీ సభ్యులు శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా, మంచినీరు, టెంట్ అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం ఆలయ కమిటీ అధ్యక్షులు, మహిళలు, యువతీ యువకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.