సిరా న్యూస్;
ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఇంటికి కోటి రూపాయలు. ఒక్కసారి కాదు ప్రతి ఏటా కోటి రూపాయలు. ప్రతి ఇంటికి ఓ హెలికాప్టర్. కొత్త జంటకు బంగారు నగలు, మూడంతస్తుల బిల్డింగ్. ఆడవాళ్లకు వంటింటి పనిభారం తగ్గించేందుకు రోబోలు, కాల్వల్లో ఈదడానికి ప్రతి కుటుంబానికి ఓ పడవ. తమిళనాడు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఓ జర్నలిస్ట్ ఇచ్చిన హామీలు ఇవి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో.. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెస్తానని హీరో ప్రామిస్ చేస్తే అంతా నవ్వుకున్నాం గానీ.. తమిళనాడులో నిజంగానే హామీలిచ్చాడు. ఇందులో.. ఎదుటివాళ్లు హామీలు ఇస్తున్నారు కదా అని ఓటు వేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశం అయితే.. పార్టీల హామీలపై సెటైర్లు వేయడం మరో ఉద్దేశం. కలర్ టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా ఎన్ని హామీలు ఇచ్చారో తమిళనాడులో. ఆ రాష్ట్రం సంగతేమో గానీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల హామీలపై ఓ చర్చ అయితే జరుగుతోందిప్పుడు. కాంగ్రెస్ హామీలపై మోదీ చేసిన కామెంట్.. ‘కాస్త చూసుకుని హామీలు ఇవ్వండంటూ’ ఖర్గే చెప్పడం చూశాక.. ‘గ్యారెంటీ పే చర్చ’ నడుస్తోంది. గెలవడానికి హామీలు ఇవ్వడం, గెలిచాక చతికిలపడడం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడం.. కొన్ని పార్టీలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అసలు విషయం. ఇంతకీ.. మోదీ ఎందుకని పర్టిక్యులర్‌గా తెలంగాణ, కర్నాటకను ఎగ్జాంపుల్‌గా చూపించారు? ఖర్గే ఎందుకని జాగ్రత్తపడ్డారు? బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మరోసారి ఆలోచించుకుంటామని కర్నాటక ప్రభుత్వం ఎందుకంది? ఉచితాలపై ఇస్తున్న హామీల విషయంలో కాంగ్రెస్ మారాలి అంటున్నారాయన. సూపర్-5, సూపర్-6, సూపర్-10.. ఇలాంటి హామీలపై పునరాలోచించుకుందాం అన్నారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా మేధావులు, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నది, హెచ్చరిస్తున్నది దీని గురించే. ఇంతకీ మల్లికార్జున ఖర్గే ఏమన్నారు? ఒక హామీ ఇచ్చే ముందు.. ‘అది సాధ్యమా కాదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, ఐదేళ్ల పాటు నడిపించగలమా లేదా’ అనేది చూసుకోమంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేయాల్సినంత అవసరం రాకూడదు అంటున్నారు. గల్లా పెట్టెలో డబ్బుల్లేకపోయినా పథకాలు అమలుచేస్తే.. అది భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ స్టేట్మెంట్లో ప్రతి అక్షరమూ నిజమే. మరో మాట కూడా అన్నారు మల్లికార్జున ఖర్గే. కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే.. ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అని. పథకాలు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడతారన్నారు. అదే జరిగితే.. భవిష్యత్ తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదంటూ హెచ్చరికలు చేశారు.కొందరు కామెంట్ చేయొచ్చు. ‘ఏం.. హామీలు ఇచ్చే ముందు తెలియలేదా ఆ విషయం’ అని. ఇప్పటికైనా ఆ మేల్కొలుపు మాటలు అంటున్నందుకు సంతోషించాలి గానీ కామెంట్ చేయనక్కర్లేదు. అంతా బాగానే ఉంది గానీ.. ఈ జ్ఞానోదయం వెనక కారణం ఏంటి? ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. పథకాల విషయంలో ఈ వెనకడుగు ఏంటి? ఎందుకంటే.. కర్నాటకలో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం పథకాన్ని ఆపేయడమో లేదా పరిమితులు విధించడమో చేయబోతున్నారని ఓ ప్రచారం నడుస్తోంది. అది నిజమే అన్నట్టుగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ఎస్.. ఉచిత బస్సుపై పునరాలోచనలో ఉన్నాం’ అంటూ మాట్లాడారు. ఈ పథకాన్ని పూర్తిగా తీసేయకపోవచ్చు గానీ.. ప్రభుత్వంపై భారం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చని చెబుతున్నారు. దీనిపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘ముందుగా హామీ ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు వెనక్కి తగ్గడం ఎందుకు’ అని ఖర్గే కామెంట్ చేసినట్టుగా చెబుతున్నారు.కాంగ్రెస్ చీఫ్ నుంచి ఈ మాట వచ్చిందో లేదో.. వెంటనే ఖర్గే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ‘అమలుచేయలేని హామీలు ఇవ్వడం సులభమే.. వాటిని అమలు చేయడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ గుర్తిస్తోంది’ అంటూ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, అభివృద్ధి ఎలా కుంటుపడిందో చూడాలంటూ కామెంట్ చేశారు. వెంటనే.. మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందుకున్నారు. గాలిమాటల గ్యారెంటీలతో మొదటికే మోసం వస్తుందన్న విషయం కాంగ్రెస్‌కు ఇప్పుడు అర్థమయిందా అంటూ విమర్శించారు. గ్యారెంటీల పేరుతో చేసిన మోసం క్షమించలేనిదంటూ ఫైర్ అయ్యారు. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో వల వేసినప్పుడు బడ్జెట్ గురించి తెలియదా అంటూ నిలదీశారు కేటీఆర్. అఫ్కోర్స్ ఈ కామెంట్లకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చిందనుకోండి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రధాని మోదీని ప్రశ్నించారు ఖర్గే. ప్రధాని మోదీ తెలంగాణ టాపిక్ తీసుకురావడంతో.. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రయాణంతో తెలంగాణ మహిళలకు 3,433 కోట్ల రూపాయలు ఆదా అయిందన్నారు. 18వేల కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ అమలు చేశామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 50వేలకు పైగా ఉద్యోగ నియామకాలు, హాస్టల్ విద్యార్ధుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు.. ఇలా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాన్ని తీసుకున్నా.. తెలంగాణదే రికార్డ్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. ఇలా సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామని బదులు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ ఓ వైపు టీడీపీ విమర్శించినా సరే.. గత జగన్ ప్రభుత్వం మాత్రం పథకాలు పంచుతూనే వెళ్లింది. ఐదేళ్లలో 2 లక్షల 74 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మలకు నేరుగా పంచామని చెప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కాని, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా.. పోయిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదు ఏపీ ప్రజలు. తెలంగాణలోనూ అదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోనే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కాని, పట్టణాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. సంక్షేమంతోనే ఎన్నికల్లో గెలుస్తాం అని ఏ పార్టీ అయినా అనుకుంటే అది పొరపాటు అవుతుందనడానికి తెలుగు రాష్ట్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్. , రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. సంపద సృష్టి జరగొచ్చు గాక. కాని అది వెంటనే జరిగిపోదుగా. రెండేళ్లో, ఐదేళ్లో పట్టొచ్చు. ఆ తరువాత ఆ సంపద నుంచి ఆదాయం పెరగొచ్చు. కాని, అంతకంటే ముందు జరగాల్సింది పథకాల అమలు. వచ్చీ రాగానే పథకాలు కావాలి, ఇవ్వాలి అనే అడుగుతారు జనం. సో, సంపద సృష్టించి, పథకాలు అమలు చేస్తాం అనే మాట కరెక్టే గానీ.. ఆ రెండింటికీ టైమ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈలోపు పథకాలు అమలు చేయాల్సిందే. సో, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంటుంది. ఓవైపు ఖజానాలో డబ్బు ఉండదు. కాని, ప్రజలకు వెంటనే పంచేయాలి. అంటే ఏం చేయాలి..? అభివృద్ధి పనులు ఆపేయాలి. లేదా ప్రజలపై భారం మోపాలి. అలా చేస్తే అల్టిమేట్‌గా నష్టపోయేది ప్రజలే. ప్రజలపై భారాలు మోపితేనే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలా చేశారనే కదా.. ‘బాదుడే బాదుడు’ నినాదాన్ని తీసుకొచ్చింది టీడీపీ. ప్రజల్లో కూడా ‘ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు’ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒకవేళ ప్రజలపై భారం మోపకూడదు అనుకుంటే.. ఎడాపెడా అప్పులు చేయాలి. అలాంటప్పుడు గత ప్రభుత్వం చేస్తున్న తప్పే ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కదా. లేదా.. అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. ఏపీలో అదే జరిగిందంటారు రాజకీయ విశ్లేషకులు. సంక్షేమ పథకాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టే సరికి గత జగన్ సర్కార్ అభివృద్ధిని మ్యాచ్ చేయలేకపోయింది అనే విమర్శ ఎదుర్కొంది. సో, ఇలాంటి తలనొప్పులు రాకూడదని ముందు జాగ్రత్తగా ఓ మంచి సూచన చేశారు మల్లికార్జున ఖర్గే. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ అనుమతిస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నారు. ఎందుకంటే.. డబ్బులేం ఊరికే రావు. అవేం ఆకాశం నుంచో ఊడిపడవు, చెట్లకు కాయవు. సో, ఉన్నంతలో ప్రజలకు ఎలా మేలు చేయగలమో ఆలోచించాలన్నారు మల్లికార్జున ఖర్గే. ఇప్పటికైనా.. ఖర్గే సూచనను ఓ అలారమ్‌గా తీసుకుని మేల్కొంటే మంచిదంటున్నారు మేధావులు