సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ అయ్యిందా? మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాల్సిందేనా? స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేయనున్నారా? వీటిలో సక్సెస్ అయ్యినవారికే పదవులా? ప్రస్తుతం అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.బాహుబలి మూవీలో కాలకేయుడ్ని అంతం చేసిన వారికే.. మహిష్మతి సింహాసనం అప్పగించాలన్నది యువరాజులకు టార్గెట్ ఫిక్స్ చేశారు శివగామి. ఇదే పరిస్థితి తెలంగాణ బీజేపీ నేతల వంతైంది. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టి.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాషాయపార్టీ అడుగులు వేస్తోందట. అందుకే.. టీ-బీజేపీ నేతలు దూకుడు పెంచారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందట. నేతల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి.. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం పావులు కదుపుతోందట. అందుకే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ వేగంగా పావులు కదుపుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కారు అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల్లో ఏవైనా తప్పిదాలు ఉంటాయని కాషాయనేతలు వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ అన్నదాతల సమస్యలపై పోరాటాలు చేస్తూ వస్తున్న రాష్ట్ర బీజేపీ.. తాజాగా మూసీ, హైడ్రాపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు ఆ పార్టీలో అధ్యక్ష, మిగతా విభాగాల పదవుల కోసం నేతల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. తెలంగాణ అధ్యక్ష రేసులో ఉండే నేతలకు ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసింది హైకమాండ్. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని, దీని లక్ష్యంగా ఇప్పటి నుంచే అడుగులు వేయాలని నేతలకు సంకేతాలు వెళ్లాయి.బీజేపీ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యనేతలు, వివిధ మోర్చాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతలు హాజరయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. సభ్యత్వం నమోదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేయాలని భావించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై కమిటీ నేతలతో చర్చించారు.రెండు లేదా మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు సునీల్ బన్సల్. ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు.ఇదే సమయంలో అటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది. అనుసరించాల్సిన వ్యూహం సంబంధిత కమిటీలతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంటక రమణరెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఆరూరి రమేష్, వినోద్ రావు, బంగారు శృతి ఈ కమిటీలో కీలక నేతలు.ఈ రెండు ఎన్నికల్లో పార్టీని సక్సెస్‌గా నడిపిన నేతలకు పదవులు ఇవ్వడం ఖాయమనే చర్చ కమలనాథుల్లో జరుగుతోంది. పార్టీని బలోపేతం చేయడమేకాదు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరనేది కూడా తేలిపోనుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ కాషాయ దళంలో కొంత స్తబ్ధత కనిపించింది. సభ్యత్వ నమోదుపై పార్టీ దృష్టి పెట్టడంతో.. మిగతా కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారట. నేతల మధ్య సమన్వయ లోపంతో క్యాడర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జాతీయ అధినాయకత్వం.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న అయోమయ పరిస్థితులకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని నిర్ణయం తీసుకుందట. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్.. రెండురోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య సమన్వయంపై విడివిడిగా నేతలతో భేటీ అయ్యారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే అంశాలపై బన్సల్ ఆరా తీసినట్లు సమాచారం.తమ నియోజకవర్గాల్లో పార్టీ నేతల తీరుతో ఎదురవుతున్న ఇబ్బందులను సునీల్ బన్సల్‌కు పార్టీ నేతలు, శ్రేణులు చెప్పుకున్నారట. వారంతా సమస్యలను బన్సల్ దృష్టికి తీసుకెళ్లారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ సిద్ధాంతం తెలిసిన వారిమని.. సీనియర్ అనే భావంతో కొందరు. కొత్తవారిని పార్టీలో తక్కువ చేసి చూస్తున్నారంటూ బన్సల్‌కు ఫిర్యాదు చేసినట్లు టాక్ నడుస్తోంది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపైనా ప్రజాప్రతినిధులను.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అడిగి తెలుసుకున్నారట. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు ఎవరూ ప్రస్తావించవద్దని.. సునీల్ బన్సల్ తెలంగాణ నేతలకు కఠినంగానే చెప్పినట్లు సమాచారం.మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ బిగ్ టాస్క్ ఇచ్చినట్టేనని అంటున్నారు.