తెలంగాణకు అఖండ వారసత్వం వుంది

సిరా న్యూస్,సిద్దిపేట;
అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది. అఖండమైన వారసత్వం ఉంది. దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి. తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం అయన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత. వైవిధ్యత. ప్రథమ ప్రధాని నెహ్రు చెప్పినట్లు బిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత ! హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మనదేశం! మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ.
తెలంగాణ ప్రాంతంలో హిందూ, ముస్లిం సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి. మహాత్మా గాంధి అంతటి మహనీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు.
బౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది. తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా. ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజలచే పాలించబడే ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1952 వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా, 1952 లో జరిగిన ఎన్నికలలో శ్రీ బూర్గుల రామకృష్ణా రావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది.
ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురుడు పోసుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలను తొక్కింది.
తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలకపాత్ర వహించారు. తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ఆస్తిత్వం, చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి తోడ్పడ్డారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు, రచయితలు, కళాకారుల్ని ఒక వేదిక వైపు తీసుకువచ్చిందని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *